ధర్మారం, ఫిబ్రవరి 10 : పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో స్థానిక వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాలు(CCTV cameras) ఏర్పాటు చేస్తామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్(CI Praveen Kumar) అన్నారు. ఈ మేరకు సోమవారం ధర్మారం పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక వ్యాపారులతో సీసీ కెమెరాల ఏర్పాటు పై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సంఘటితంగా ముందుకు వచ్చిన వ్యాపార, వాణిజ్య వర్గాలకు, కుల సంఘాలకు అభినందనలు తెలిపారు.
సంఘటితంగా ముందుక దొంగతనాల నివారణ కోసం సీసీ కెమెరాలు ఎంతో అవసరమని, త్వరితగతిన నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఒక్కో సీసీ కెమెరా 100 మందితో సమానమని, దినదినాభివృద్ధి చెందుతున్న ధర్మారం పట్టణ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంచి నిర్ణయం తీసుకున్న ధర్మారం ఎస్ఐ శీలం లక్ష్మణ్, కానిస్టేబుల్ రజనీకాంత్ ను సీఐ అభినందించారు.
ఇందుకుగాను ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వారం పది రోజుల్లో ధర్మారం పట్టణంలో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సీఐ చెప్పారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆయా గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి నేరాల నియంత్రణలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.