పెద్దపల్లి రూరల్, జూలై 28: ఆ గ్రామం అంతా ఆర్థికంగా ఉన్న అన్ని కులాల వారితో ఒకే ఒక వాడలాగా రోడ్డుకు ఇరువైపుల విస్తరించి ఉంటుంది. ఇంకే ముంది ఒకే రోడ్డు కదా అని ఇదివరకున్న పాలకులు, అధికారుల సహాయ సహకారాలతో అప్పట్లోనే సీసీ రోడ్డు నిర్మాణం వేశారు. అయితే ఆ రోడ్డు పొడవునా మురికి నీళ్లు, వరద నీళ్లు పోయేలా మోరీని అంతకు ముందే నిర్మించారు. కాని పాలకుల పట్టింపులేని తనమో, అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యమో తెలియదు కాని ఆ రోడ్డువెంట ఉన్న సైడ్ డ్రైన్ పూర్తిగా చెత్త చెదారం, మట్టితో నిండిపోయింది. దీంతో రహదారి పైకి వర్షపు నీరు, మురుగు నీరు చేరి సీసీ రోడ్డు ధ్వంసమై మడుగులను తలపిస్తున్నది.
పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి గ్రామం అంతా అన్ని కులాల వారు ఎంతో కొంత పెద్దపల్లి మండలం కాసులపల్లి తర్వాత గుర్రాంపల్లినే అన్నింటిలో ఆర్థికంగా ఉన్న వారి గ్రామంగా ముద్రపడింది. ఇదిలా ఉండగా గ్రామంలో పెద్దపల్లి- కాల్వశ్రీరాంపూర్ వెళ్లే మార్గం నుంచి ఒకే ఒక రోడ్డుతో ఊరి ప్రవేశంలోనే ప్రభుత్వ పాఠశాలతో ప్రారంభమై పాఠశాలకు ఎదురుగా ఉన్న ఎస్సీ కాలనీ పోను మిగతా గ్రామం అంతా ఒకే వాడలా ఉండి ఒకే ఒక రోడ్డుతో నిర్మితమై ఉంటుంది. ఆ రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మాణం చేసి దానికి మురికి నీరు కిందకు వెళ్లేలా సైడ్ డ్రైన్ నిర్మించారు. కానీ నిర్వహణ లేకపోవడంతో ఆ మురికి కాలువ కొంత కాలానికే మట్టి, చెత్తా చెదారంతో నిండిపోయింది. దీంతో మురుగునీరు పోయే మార్గంలేక రోడ్డు చెడిపోవడానికి కారణమయ్యాయి. ఇదిలా ఉంటే సీసీ రోడ్డుపై చిన్న గుంతలు పడితే దానిని మళ్లీ సీసీతోనే గుంతలను పూడ్చాల్సి ఉంటుంది. కానీ అధికారులు మాత్రం కంకర చిప్స్‌తో కూడిన డస్ట్‌ను నింపి చదును చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వెళ్లే మార్గంలేక నీరు రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో రోడ్డుపై గుంతలు పడి నీటి మడుగులా మారి వాహనదారులు, గ్రామస్తులకు ఇబ్బంది కరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.