పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని మురుమూరు నుంచి మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేత, కార్మిక నాయకుడు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల విలువైన మట్టి అక్రమంగా అక్రమంగా తరలివెళ్తున్నదని, దానిని ప్రభుత్వం నిలువరించాలన్నారు. ఈమేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఏవో శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది మురుమూరు నుంచి అనుమతులు తీసుకొని మట్టి రవాణా చేశారని, పరిమితికి మించి మట్టి వెలికితీయడంతో పాటు మట్టిని రోలర్లతో తొక్కించి చదును చేశారన్నారు. 1,50,000లకు పైగా మెట్రిక్ టన్నుల మట్టి అక్కడ నిల్వ ఉండగా కేవలం 80 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నట్లుగా చూపించారని ఆరోపించారు. జరిమానా విషయంలో సాధారణంగా డబ్బులు కట్టించుకున్నారే తప్ప పూర్తిగా ఫైన్‌ను వసూలు చేయలేదని చెప్పారు. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్‌తో సతమతమవుతుంటే.. కోట్ల రూపాయల విలువైన మట్టిని కొల్లగొడుతున్నా అధికారులు అనుమతులివ్వడం విమర్శలకు తావిస్తుందన్నారు.
కొందరు ప్రజా ప్రతినిధుల ఒత్తిడులకు తలోగ్గి అనుమతులు ఇచ్చారని, భారీగా డబ్బులు చేతులు మారాయన్నారు. నిర్ణీత మట్టి కంటే అత్యధికంగా తోడిన వారికి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్రస్థాయి అధికారులు చొరవ చూపి పూర్తిస్థాయి విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తరలి వెళ్తున్న మట్టిని వెంటనే నిలిపివేసి మట్టి నిల్వలకు వేలం నిర్వహించాలన్నారు. కౌశిక్ హరి వెంట మద్దికుంట శంకర్, నిమ్మరాజుల రవి, కుక్క గంగప్రసాద్, తమ్మనవేని మహేష్, ముత్యం లక్ష్మణ్, వంశీ, రవితేజ, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజు కుమార్, దాసరి సతీష్, మాదాసి శ్రీనివాసు, బత్తిని సతీష్, చంద్రమోహన్ కుర్ర, రమేష్ కాంపెల్లి, సుధాకర్ గాలేంకి, ప్రసాద్ వొల్లపు, మల్లేష్ దొబ్బెల్, తిరుపతి గోనే, రాజయ్య, శంకర్ నాయక్, మాటేటి నరేష్ ఉన్నారు.