పెద్దపల్లి: పెద్దపల్లి కూనారం ఆర్వోబీ వద్ద క్లస్టర్ విరిగిపోయింది. దీంతో ఖాజీపేట-బలర్షా రైల్వే మార్గం ఇరువైపులా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు.
ఈ నేపథ్యంలో సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. బస్సుల కోసం వందలాది మంది రాజీవ్ రహదారిపైకి చేరుకున్నారు. ఆటోలు, బస్సుల్లో తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. కాగా, ఉదయం 3.35 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి బయలుదేరిన ఈ రైలు 10.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవాల్సి ఉంది.
ఓదెల, జూన్ 27 : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా వాళ్ళు రైళ్లుకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లిలో కునారం వెళ్లే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కారణంగా రైళ్లను నిలిపివేసి పనులు సాగిస్తున్నారు. ఈ కారణంగా కొలనూర్, పోత్కాపల్లి, బిజిగిరి షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, రాఘవాపూర్, రామగుండం ఇంకా పలు స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైలుతోపాటు ప్యాసింజర్ రైలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రాంత ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి గమ్యస్థానాలకు వెళ్లారు. ఉదయం 6:30 నిమిషాల నుంచి ట్రైన్లు నిలిచిపోవడంతో ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణికులు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు తినడానికి ఏమీ దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 10:30 వరకు కూడా రైలు నడవలేదు. ఈ కారణంగా ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. రైల్వే అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడాన్ని ప్రయాణికులు నిరసించారు.