Collector Koya Sri Harsha | పెద్దపల్లి, మే 22( నమస్తే తెలంగాణ): ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అయన గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ తో కలిసి బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఇంటి రుణాలు, విద్యా రుణాలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రుణాల పంపిణీ తగ్గడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ సేవలు తగ్గకుండా చూడాలని, జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అందులో 15 రోజుల్లో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు వినియోగించేలా చూడాలని, ప్రభుత్వం తరఫున అందే పథకాలు కూడా ఆన్ లైన్ లో లబ్ధిదారులకు అందేలా చూడాలని అన్నారు.
2024-25 లో జిల్లాలోని రైతులకు పంట రుణాల క్రింద 1864 కోట్లు పంపిణీ లక్ష్యానికి గాను రూ.1358 కోట్ల పంపిణీ చేశామని, వ్యవసాయ టర్మ్ రుణాల పంపిణీ కు నిర్దేశించిన లక్ష్యం చేరుకున్నామని, ఇదే దిశగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. 2025-26 సంవత్సరంలో రైతులకు అందించే స్కేల్ ఆఫ్ లోన్ డిస్ట్రిబ్యూషన్ పెంచాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ టర్మ్ రుణాల పంపిణీ పై దృష్టి సారించాలని అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు వ్యవసాయ టర్మ్ రుణాల లక్ష్యాల సాధనలో వెనుకబడిందని, ఈ సంవత్సరం మెరుగ్గా రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు.
ఎంఎస్ఎంఈలకు. 2024-25 లో రూ.1364 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కాగా రూ.951 కోట్ల రుణం పంపిణీ చేసినట్లు చెప్పారు. 5 వేల 844 స్వశక్తి సంఘాలకు 469 కోట్ల 37 లక్షలు బ్యాంకు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు రుణాల పంపిణీ పెంచాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి క్రింద విజయవంతంగా నడుస్తున్న వ్యాపార యూనిట్లకు ప్రచారం కల్పించాలని అన్నారు.
మరో 2 నెలలో వి-హబ్ కూడా అందుబాటులో వస్తుందని, మహిళలు మరింత వ్యాపార రంగంలో ఎదిగేందుకు బ్యాంకుల కూడా ముందుకు రావాలని అన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.