పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కేంద్రం ఎదుట మంగళవారం ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. దీర్ఘ కాలికంగా ఉన్న తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆత్మకూరి లత మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల జులై నెల పారితోషికం వెంటనే చెల్లించడంతో పాటు తమకు నెలకు రూ.18 వేల ఫిక్సిడ్ వేతనం అందించాలన్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలని, అర్హులైన ఆశాలకు ఏఎన్ఎం, జీఎన్ఎంగా అవకాశం కల్పించాలని డిమండ్ చేశారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, ఆశాలకు పని భారం తగ్గించి, రక్షణ కల్పించాలని లత స్పష్టం చేశారు. అనంతరం మండల వైద్యాధికారి నరేష్‌కు వారు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షురాలు మచ్చ సుజాత, సభ్యులు పబ్బ వసంత, అరికట్ల చంద్రకళ, బతికపల్లి లత తదితరులున్నారు.