పెగడపల్లి : పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామ సమీపంలోని పెద్దగుట్ట వద్ద బుధవారం ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలకు తవ్వకాల్లో పురాతన కాలం నాటి నాణాలు లభించాయి. కూలీలకు నాణేలు దొరకడంతో ఫీల్డ్ అసిస్టెంట్ మంజులకు వారు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమె ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డికి వివరించారు. దీంతో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రవికిరణ్, ఆర్ఐ జమున పంచాయతీ కార్యదర్శి నిఖిల్ రెడ్డి ఉపాధి పనులు చేపడుతున్న దగ్గరికి వెళ్లి పురాతన నాణాలను పరిశీలించారు.
లభించిన నాణాలను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నట్లు ఎంపీడీవో వివరించారు. నాణేలు లభించాయని సమాచారం తెలియడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వాటిని ఆసక్తిగా పరిశీలించారు. పురాతన కాలంకు చెందిన ఈ వెండి నాణేలు ఉర్దూ భాషలో ఉన్నాయని, వీటిని పురావస్తు శాఖ అధికారులకు పంపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.