Operation Kagar | కోల్ సిటీ, జూన్ 7: చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చకుండా అడవిలోకి తీసుకవెళ్లి బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జీవీ చలపతి రావు అన్నారు. ఈమేరకు శనివారం గోదావరిఖనికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బూటకపు ఎన్ కౌంటర్ లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల కిందట చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జాతీయ పార్కు వద్ద అరెస్టు చేసిన కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ ను చిత్రహింసలు పెట్టి దారుణంగా ఎన్కౌంటర్ చేశారనీ, అతని సహచరుడు భాస్కర్ ని కూడా కాల్చి చంపారని ఆరోపించారు.
ఇంకా పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేరుతో మట్టుబెట్టే అవకాశం కోసం చూస్తున్నారనీ, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిరాయుధులుగా ఉన్న వారిపై హత్యాకాండ కొనసాగించడంను ప్రజలంతా ఇండించాలని కోరారు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని తమ ఆధీనంలో ఉన్న మావోయిస్టులను కోర్టుకు హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి అక్కడి ఖనిజ సంపదను తరలించడానికి ఇలాంటి హత్యాకాండకు పాల్పడుతుందని ఆరోపించారు. సమావేశంలో ఐఎన్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు ఇ.నరేష్, ఏ.వెంకన్న, సీహెచ్ శంకర్, అశోక్, బుచ్చక్క తదితరులు పాల్గొన్నారు.