పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలంలోని (Peddapalli) సబ్బితం గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన పెరుక రాయమల్లు (57) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటరితనం భరించలేక బలవన్మరణం చెందినట్లు బసంత్ నగర్ ఎస్ఐ స్వామి తెలిపారు. రాయమల్లు భార్య ఏడాదిన్నర క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాయమల్లు దంపతులకు ఇద్దరు కూతుర్లు కాగా వారికి అప్పటికే పెళ్లీలు అయ్యాయి.
అప్పటి నుంచి ఇంట్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య ప్రమాదంలో మృతి చెందడం ఇంట్లో ఎవరు లేక ఒక్కడే ఉంటుండడంతో ఒంటరి తనం భరించలేక మనోవేదనకు గురైన రాయమల్లు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కూతుర్లకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం దవఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కూతురు గోలి సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.