వివరాలను అప్లోడ్ చేస్తున్న బ్యాంకర్లు
రూ. 50 వేలల్లోపు రుణాలున్నవారికి లబ్ధి
పెద్దపల్లి జిల్లాలో 17, 052 మంది
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10,289 మంది,జగిత్యాల జిల్లాలో 16,796 మందికి మేలు
రెండు మూడు రోజుల్లో నగదు ఖాతాల్లో జమ
పెద్దపల్లి, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఈనెల 16 నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంకానున్నది. ఈసారి రూ.50 వేలలోపు రుణాలు తీసుకున్న 44,137 మందికి లబ్ధి చేకూరనున్నది. రేపటి నుంచే అన్నదాతల ఖాతాల్లో మాఫీ నగదు జమకానుండగా సర్కారు నిర్ణయంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రెండో విడుత రుణమాఫీ ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరనున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44,137 మంది ఖాతాల్లో డబ్బు జమ కానుంది.
తొలి విడుతలో 24,783 మందికి
ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన తర్వాత తొలి విడుతగా రూ. 25వేల లోపు రుణాలను మాఫీ చేసింది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 87, 680మంది రైతులు దాదాపుగా రూ. 150 కోట్ల వరకు వ్యవసాయ రుణాలను తీసుకున్నారు. ఇందులో రూ.25వేలలోపు 8,614 మంది రైతులు పొందగా, వారికి తొలి విడుతలోనే మాఫీ అయింది. ఇలా తొలి విడుత జిల్లాలో రూ. 13.04కోట్ల రుణ మాఫీ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.25వేలలోపు 6,841 మంది రుణం పొందగా వారికి తొలివిడుతలో రూ. 7.55 కోట్ల మాఫీ జరిగింది. జగిత్యాల జిల్లాలో 9,328 మందికి గానూ రూ. 13.81 కోట్లను రుణ మాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు.
తాజాగా 44,137 మందికి ..
ప్రభుత్వం ఈ నెల 16 నుంచి రూ.50వేల లోపు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. దీంతో పెద్దపల్లి జిల్లాలోని 17, 052మంది రైతులకు సంబంధించిన రూ. 56.09కోట్ల రుణా లు మాఫీ కానున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.50 వేలలోపు రుణం పొందిన వారు 10, 289 మంది లబ్ధి పొందనుండగా రూ.36.65 కోట్లు మాఫీ కానుంది. జగిత్యాల జిల్లాలో 16, 796 మందికి రూ.58.88 కోట్ల రుణమాఫీ కానుంది. తొలి విడుతకంటే తాజాగా రూ. 50 వేల లోపు రుణాలను పొంది మాఫీ అవుతున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఖాతాల్లోకి మాఫీ నగదు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ప్రకారం రెండు, మూడు రోజుల్లోనే రూ. 50వేల వరకు రుణమాఫీ అమలు కానున్నుట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ దాకా రుణమాఫీకి సంబంధించిన రూ. 50వేలు సంబంధిత రైతుల ఖాతాల్లో జమ వుతాయని చెబుతున్నారు. గతంలో రూ. 25వేలు రుణమాఫీ చేసిన సర్కారు ఈసారి రూ. 50వేల వరకు రుణాలను మాఫీ చేస్తున్నది. 2018 డిసెంబరు 11 వరకు తీసుకుని ఉన్న రూ. లక్ష వరకు రుణ మాఫీకి అర్హత కటాఫ్ తేదీగా నిర్ణయించారు.
ప్రత్యేక పోర్టల్‌లో వివరాలు..
ప్రస్తుతం రెండో విడుత రూ. 50వేల రుణమాఫీ ప్రక్రియను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడుత ప్రియ పూర్తిగాకపోవడం, రెండో విడుతను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ ప్రక్రియకు ఒక ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉన్న నేషనల్ ఇన్ఫర్మేషన్ సెల్ ద్వారా బ్యాంకు బ్రాంచ్‌ల నుంచి నేరుగా అర్సులైన రైతుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియ నిర్వహిస్తోంది. రుణమాఫీకి అర్హులైన రైతులకు సంబంధించి పంట రుణా ల వివరాలను బ్యాంకు బ్రాంచుల ద్వారా సేకరిస్తున్నారు. ఒకటికి మించి బ్యాంకు బ్రాంచీల్లో రైతులు కలిగి ఉన్న పంట రుణాలతో పాటు బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాల వివరాలను గుర్తించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రైతుల బ్యాంక్ ఖాతాల్లో తప్పిదాలను కూడా గుర్తించి సరి చేస్తూ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఆధార్, మొబైల్ నంబర్, గ్రామం, మండలం తదితర వివరాలను సరిచూసి అప్లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో గ్రామాల్లో ఉన్న ఏఈవోల సహకారం తీసుకుంటున్నారు. ఆగస్టు 15నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి రూ. 50వేల వరకు రుణమాఫీకి అర్హులైన రైతులను గుర్తించి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమకు చర్యలు తీసుకుంటున్నారు.
రైతులకు ఊరట..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 50వేల దాకా రుణమాఫీ ఈ నెల 16 తేదీ నుంచే అమలు అవుతున్నది. ఇప్పటికే దీనిపై కలెక్టర్, జిల్లా అధికారులు సమీక్ష నిర్వహించారు. బ్యాంకులకు వ్యవసాయ అధికారులను అనుబంధం చేసి సహకరించి వేగంగా రుణమాఫీకి చర్యలు చేపట్టాం. బ్యాంకులు కూడా ఇదే పనిలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న రైతులకు రుణమాఫీ ఊరటనిచ్చే విషయం.
-తిరుమల్‌ప్రసాద్, డీఏవో పెద్దపల్లి