వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన
ముందస్తు ధాన్యం అంచనా సులువు
కొనుగోళ్ల ఇబ్బందులకు చెక్
పెద్దపల్లి జిల్లాలో 2.89 ఎకరాల్లో సాగవుతున్న పంటలు
పెద్దపల్లి, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు ఇక ఆన్లైన్లో నమోదు కానున్నాయి. వివిధ రకాల పంటల సాగు వివరాలను రాష్ట్ర సర్కారు ఆన్లైన్లో పొందుపరచనుంది. ఏఈవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల వివరాలతో పాటు భూమి విస్తీర్ణం, పంటల రకం తదితర వివరాలను నమోదు చేసుకొని ఆన్లైన్లో పొందుపరచనున్నారు. దీంతో ధాన్యం అంచనా వివరాలు ముందుగానే తెలుసుకోవడమే కాకుండా కొనుగోలు సమయంలో ఇబ్బందులో తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది.
రైతుల నుంచి వివరాల సేకరణ..
పంటలకు సంబంధించిన వివరాలను ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. రైతు పేరు, తండ్రి పేరు, సర్వే నంబర్, సాగు చేస్తున్న పంట, పంటల సాగు రకం, ఫోన్ నంబర్, పంటల సాగు విస్తీర్ణం, నీటి సౌకర్యం వివరాలను అధికారులు రైతుల నుంచి సేకరించి నమోదు చేసుకుంటున్నారు.
ఇబ్బందులకు చెక్..
రైతులు సాగు చేస్తున్న పంటలను పండించిన తర్వాత ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం పంటల సాగు వివరాలను సేకరిస్తున్నది. సాగవుతున్న వరి, పత్తి, మిర్చి, పప్పు ధాన్యాలు, జొన్నలు, మక్కలు, సోయా, కంది తదితర పంటల వివరాలతో పాటు సాగు విస్తీర్ణం నమోదు చేస్తున్నది. నీటి ఆధారాలైన చెరువు, బోరు లేదా కెనాల్ ద్వారా పారకం వివరాలు తెలియడంతో పాటు పండిస్తున్న పంటల ద్వారా వచ్చే ధాన్యం వివరాల అంచనా వేస్తున్నది. దీంతో సాగు చేసిన వివరాల ఆధారంగా పంటల కొనుగోలులో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
వివరాలను అందించాలి
ప్రతి రైతు వానకాలంలో సాగు చేస్తున్న పంటల వివరాలు, పంట రకం, విస్తీర్ణం, నీటి లభ్యత తదితర వివరాలను ఏఈవోలకు అందించాలి. దీంతో సాగవుతున్న పంటల వివరాలతో పాటుగా దిగుబడి అంచనా తదితర వివరాలు తెలుస్తాయి. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తాం.