కోల్ సిటీ , మార్చి 13: అనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే.. అని సినీ గేయ రచయిత అన్నట్టు గోదావరిఖనిలో 40 యేళ్ల కిందట పదవ తరగతి(10th class) చదివిన బాల్యమిత్రులంతా గురువారం ఒకే వేదికపై కలుసుకొని ఆనంద పరవశంలో మునిగిపోయారు. అప్పటి బాల్య స్మృతులను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో గురువారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా అంతా కలుసుకొని నాటి మధుర జ్ఞాపకాలతో మళ్లీ బాల్యంలోకి వెళ్లిపోయారు. ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, కాంట్రాక్టర్లుగా ఎక్కడెక్కతో స్థిరపడి ఉన్న స్థానాల్లో కొనసాగుతూ చాలా యేళ్ల తర్వాత కలుసుకొని మాటకు అందని భావాలతో గడిపారు.
ఈ సందర్భంగా తమలో ఒకరైన డా. వాసంపల్లి ఆనందబాబు అటు వైద్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాజకీయాల్లో రాణిస్తూ ఇటీవల తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా చిన్ననాటి మిత్రులంతా శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. తమ మిత్రుల్లో ఒకరు రాజకీయాల్లో రాణించడం గర్వంగా ఉందని కొనియాడారు. కార్యక్రమంలో బాల్యమిత్రులు బొడ్డుపల్లి రాజమౌళి, పులి మొగిలి, అంజనకుమార్, జిల్ల కుమారస్వామి, పాషా, తిరుపతి, శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.