శ్రమదానం.. పారిశుధ్య కార్యక్రమాలు
ట్యాంకులు, గోళాల్లో నిల్వ ఉన్న నీరు పారబోత
ఉత్సాహంగా హరితహారం
స్వచ్ఛందంగా తరలివస్తున్న గ్రామస్తులు
స్ఫూర్తి నింపుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
కరీంనగర్లో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్
ధర్మపురిలో హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని
పెద్దపల్లి, జూలై 2 (నమస్తే తెలంగాణ): పల్లెలు.. పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరోదఫా చేపట్టిన ‘పల్లె.. పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలు ప్రజల్లో స్వచ్ఛ స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. రెండో రోజు శుక్రవారం అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో డ్రై డే నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్లలో నీటి తొట్టెలు, పాత ట్యాంకులు, నిరుపయోగంగా ఉన్న పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయించి, శుభ్రం చేయించారు. మరోవైపు హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కరీంనగర్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె.. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు డ్రైడే నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఆయా పట్టణాలు, గ్రామాల్లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటిలో నిల్వ ఉన్న అపరిశుభ్ర నీటిని తొలగించుకునే విధంగా అవగాహన కల్పించారు. నీటి తొట్టెలు, పాత ట్యాంకు లు, నిరుప యోగంగా ఉన్న పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయించి, శుభ్రం చేయించారు. కరీంనగర్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లోని 59వ డివిజన్లో జరిగిన పట్టణ ప్రగతి కా ర్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శంకరపట్నం మం డలంలోని కేశవపట్నం, చింతగుట్ట, తాడికల్, ఎరడపల్లి, అంబాల్‌పూర్, వంకాయగూడెం తదితర గ్రామాల్లో పర్యటించి మొక్కలు నాటారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం పెద్దనక్కలపేట, దుబ్బలగూడెం గ్రామాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకాని మొక్కలు నాటారు. అనంతరం ఆయా గ్రామాల వీధుల్లో పర్యటించారు. పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.