పెద్దపల్లి, జూలై17: పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయం అధ్వానంగా మారింది. భవనం శిథిలావస్థకు చేరి భయపెడుతున్నది. పెద్దపల్లి చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం 100 మందికిపైగా వస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. ఒకప్పుడు పర్మినెంట్ భవనంలో రెండు గదులతో నడిచిన లైబ్రరీ ఇరుగ్గా మారడంతో కొత్త భవనం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ పాత భవనాన్ని పెద్దపల్లి మున్సిపల్‌కు అప్పగించారు.
కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో శంకుస్థాపన కూడా చేశారు. అయితే విద్యార్థి సంఘాల వ్యతిరేకతతో నిర్మాణ ప్రక్రియ ముందుకుసాగలేదు. ప్రస్తుతం పెద్దపల్లి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలోని పాత దూరదర్శన్ భవనంలో కొనసాగుతున్న లైబ్రరీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. కనీస మౌలిక వసతులు లేవు. టాయ్లెట్లు కూడా లేవు. పుస్తకాలు, కుర్చీల కొరత వేధిస్తున్నది.
ఇరుకు గదులు, భవనం శిథిలావస్థకు చేరడంతో వానొస్తే చాలు స్లాబ్ ఊరుస్తున్నదని, గొడలు తడిసి చెడు వాసన వస్తున్నదని, భవనం చుట్టూ వర్షం నీరు చేరుతుండడంతో లోపలికి రాలేకపోతున్నామని పాఠకులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వసతులు కల్పించాలని, వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు.
మరో భవనంలోకి మార్చాలి
జిల్లా గ్రంథాలయంలో కనీస వసతులు లేవు. ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా కనిపిస్తున్నది. వానొస్తే భవనం చుట్టూ నీరు చేరి రాకపోకలకు ఇబ్బందైతున్నది. గోడలు చెమ్మపట్టి బ్యాడ్ స్మెల్ వస్తున్నది. చాలా ఇబ్బంది అయితున్నది. ప్రిపేర్ కాలేకపోతున్నం. వీలైనంత త్వరగా గ్రంథాలయాన్ని అన్ని వసతులున్న వేరే భవనంలోకి మార్చాలి.
– ఎస్ సతీశ్, గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి (పెద్దపల్లి)
వాష్ రూమ్‌లు లేవు
మేం రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లైబ్రరీలోనే ప్రిపేరవుతున్నం. ఇక్కడ సరిపడా కుర్చీలు లేవు. ఫ్యాన్లు లేవు. వాష్ రూమ్, టాయ్‌లెట్స్ కూడా అందుబాటులో లేవు. దోమలు కుడుతున్నాయి. చదువుకోలేకపోతున్నాం. లైబరీలో కనీస మౌళిక వసతులు కల్పించాలి.
-బీ ప్రియాంక, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి (పెద్దపల్లి)