పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నత్తనడకన సాగుతున్నది. బీఆర్ఎస్ సర్కారు చొరవతో నిర్మాణానికి అడుగు పడినా.. ప్రభుత్వం మారడంతో పనుల్లో ఆలస్యం జరుగుతున్నది. వచ్చే మేలోగా పూర్తి చేయాల్సి ఉన్నా.. అప్పటి వరకు పూర్తవడం అనుమానంగానే కనిపిస్తున్నది. నిత్యం ఈ రైల్వేలైన్‌లో వందలాది రైళ్లు నడస్తుండగా, గంటలో నాలుగైదు సార్లు గేటు పడి నియోజకవర్గ ప్రజలు నరకం చూస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండగా, వంతెన త్వరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.
పెద్దపల్లి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి రైల్వే జంక్షన్‌కు రైళ్ల తాకిడి అంతా ఇంతా కాదు. ఢిల్లీ-గ్యాంగ్‌టక్ రూట్ కావడంతో నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు సాగుతాయి. పెద్ద ఎత్తున ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్, గూడ్స్ రైళ్లు నడుస్తుంటాయి. ఈ రైల్వేమార్గం పెద్దపల్లి శివారును ఆనుకొని ఉంటుంది. పెద్దపల్లి నుంచి ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, జమ్మికుంట, వరంగల్ దాకా ఇదే ప్రధాన రహదారిగా ఉంది. అయితే పెద్దపల్లి శివారులో ఉన్న రైల్వే లైన్‌పై ప్రతి 15 నిమిషాలకోసారి గేటు పడుతుండగా, జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గంటలో నాలుగైసార్లు గేటు పడుతుండడంతో నరకం చూస్తున్నారు. కొన్నిసందర్భాల్లో అత్యవసర వైద్యం అవసరమైనవారు అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీంతో ఈ ప్రాంత నాయకులు, ప్రజలు కలిసి పెద్దపల్లి-కూనారం ఆర్వోబీ కోసం కూనారం ఓవర్ బ్రిడ్జి సాధన సమితి పేరిట పోరాటాలు సైతం చేశారు. అయినా ప్రతి ఎన్నికల సమయంలో నాయకులు హామీ ఇచ్చి మరిచిపోవడమే తప్పా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, గత బీఆర్ఎస్ సర్కారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చింది.
కేంద్రం సహకారంతో ఆర్వోబీని మంజూరు చేసింది. రాష్ట్రం 60 శాతం, కేంద్రం 40 శాతం భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించి, సంయుక్తంగా 119.5 కోట్ల నిధులను మంజూరు చేశాయి. 2022 అక్టోబర్ 10న నిర్మాణ పనులను అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి ప్రారంభించగా, మొదట్లో ఈ పనులు వేగవంతంగా సాగాయి. అయితే తర్వాత ప్రభుత్వం మారడం, నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.
ప్రస్తుత పెద్దపల్లి ఎమ్మెలే పలుసార్లు పనులను పరిశీలించినా వేగవంతంగా సాగడం లేదు. ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు. అదే విధంగా బ్రిడ్జి 46 స్లాబులకు కేవలం 20 స్లాబుల నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. అలాగే వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉన్నది. వచ్చే ఏడాది మేలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా, అనుమానంగానే ఉన్నది. పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇప్పటికీ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి, రైల్వే గేటు కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
మా తాతలు తండ్రుల కాలం నుంచి రైల్వే బ్రిడ్జి లేక అరిగోస పడుతున్నం. మేం ప్రతిరోజూ పెద్దపల్లి-కూనారం రోడ్డుపై ప్రయాణిస్తుంటం. అయితే గేటు పడినప్పుడల్లా గంటల తరబడి ఇక్కడే ఉంటున్నం. రైలు కూత వినిపించిందంటే చాలు భయం వేస్తున్నది. ఎక్కడ గేటు పడుతుందోనని భయంతో అటూ.. ఇటూ దాటుతున్నం. త్వరగా రైల్వే బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి.
– పూసాల రమణాచారి, వెన్నంపల్లి (కాల్వశ్రీరాంపూర్ మండలం)
మాది జాఫర్‌ఖాన్‌పేట. మాకు ఏం కావాలాన్నా పెద్దపల్లికి రావాల్సిందే. ఈ మార్గ మధ్యలో ఉన్న రైల్వేగేటు మా గ్రామాలకు తీరని శాపంగా మారింది. నేను స్కూలు, కాలేజీకి వెళ్లింది కూడా ఈ దారి నుంచే. చిన్నప్పటి నుంచి ఈ గేటుతో ఎన్నో బాధలు పడ్డం. నేనే కాదు మా చుట్టుపక్కల ఉన్న రాంపెల్లి, మారేడుగొండ, గుర్రాంపల్లి, వెన్నంపల్లి, మంగపేట, కూనారం, కాల్వశ్రీరాంపూర్ గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందిపడుతున్నరు. ఈ వంతెన ఎప్పుడు పూర్తయితదో.. మా కష్టాలు ఎప్పుడు తీరుతాయో.
-పనాస రమేశ్, జాఫర్‌ఖాన్‌పేట్ (కాల్వశ్రీరాంపూర్ మండలం)