పెద్దపల్లి/పెద్దపల్లి కమాన్/పెద్దపల్లి రూరల్, మార్చి 8 : మహా శివరాత్రి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, శివనామస్మరణతో ఆల యాలు మార్మోగాయి. పెద్దపల్లిలోని శ్రీమడ్ల రామ లింగేశ్వరాలయంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌లాల్ ప్రత్యేక పూజలు చేశారు. రైల్వేస్టేషన్ రోడ్‌లోని శివ పంచాయతన ఆలయంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో శివాలయం కమిటీ చైర్మన్, కౌన్సిలర్ ఇల్లెందుల కృష్ణమూర్తి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి మండలంలోని శివాలయాల్లో భక్తులు స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లిలో మేరు సంఘం ఆధ్వర్యంలో శంకర్ దాసమయ్య ఉత్సవాలను శుక్రవారం నిర్వహించారు. ముత్యాల పోచమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్రగా వెళ్లి పట్టణంలోని అన్ని దేవాలయాల్లో అభిషేకాలు చేశారు.
ఓదెల, మార్చి 8: జిల్లాలోనే పెద్ద శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదపండితులు దూపం వీరభద్రయ్య, మఠం భవానీప్రసాద్, పంచాక్షరి, గంగాధర్, నర్సింహచార్యులు, అభిషేక్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు విజయరమణారావు, వివేక్‌వెంకటస్వామి వేర్వేరుగా పలు ఆలయాలను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్పరపల్లిలోని శివగట్టు మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులతో కలిసి ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు చేశా రు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
జూలపల్లి, మార్చి 8 : జూలపల్లి, కోనరావుపేట, వడ్కాపూర్‌లో శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు. మండల కేంద్రంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, రాజరాజేశ్వరస్వామి ఆలయ నిర్మాణ దాత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. ఇక్కడ వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, ఎంపీటీసీలు అమరగాని మమత, దండె వెంకటేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, నాయకులు దారబోయిన నరసింహం, పొట్టాల మల్లేశం, కూసుకుంట్ల మంగ, కొప్పుల మహేశ్ పాల్గొన్నారు.
ఎలిగేడు, మార్చి 8: ఎలిగేడు శివాలయం, లాలపల్లిలో శ్రీ మల్లికార్జునాలయం, రాముల-ర్యాకల్‌దేవ్‌పల్లి నాగలింగేశ్వరాలయం, ధూళికట్ట శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు.
కాల్వశ్రీరాంపూర్, మార్చి8 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హరనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. జగత్ మహామునీశ్వర స్వామి ఆలయంతో పాటు శివాలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. పలు ఆలయాల్లో శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు.
ధర్మారం, మార్చి8: మండలంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రచ్చపల్లిలో సాంబశివుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు రథోత్సవం నిర్వహించారు. మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వేడుకలకు హాజరు కాగా, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి తో కలిసి సాంబశివుడి ఆలయంతో పాటు శ్రీ రామాలయంలోని మల్లన్న గుడిని సందర్శించారు. అనంతరం ఈశ్వర్ దంపతులు నంది మేడారంలోని అమరేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ చైర్మన్ మణిశర్మ, సభ్యులు ఈశ్వర్, ఎంపీపీ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు ముత్యాల బలరాం రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఎంపీటీసీలె బెల్లాల రోజా రాణి – లక్ష్మణ ప్రసాద్, మిట్ట తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని పలు శివాలయాల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీల బాధ్యులు సన్మానించారు.
కమాన్‌పూర్, మార్చి 8: మండలంలో మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కమాన్పూర్లోని చంద్రశేఖరస్వామి, జూలపల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయాల్లో భక్తులు దీపారాధన చేశారు.
ముత్తారం, మార్చి 8: మండలంలో శివరాత్రి వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. అడవిశ్రీరాంపూర్‌లో వీర బ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. మచ్చుపేటలోని బహుగుళ్ల గుట్ట వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేశారు. చొప్పరి సదానందం, గోవిందుల పద్మ ఆనంద్ భక్తులకు నీరు, పండ్లు పంపిణీ చేశారు.
రామగిరి, మార్చి 8 : బేగంపేటలోని శ్రీ రామలింగేశ్వరస్వామి, భక్త మార్కండేయ స్వామి, నాగుల మల్లికార్జున స్వామి, కల్వచర్లలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం, సెంటినరీకాలనీలోని త్రయంబకేశ్వరస్వామి ఆలయాల్లో కల్యాణోత్సవం నిర్వహించారు.
ఫర్టిలైజర్‌సిటీ, మార్చి 8: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖని గోదావరిలో పుణ్య స్నానాలకు భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెల ఒడ్డున, బ్రిడ్జి కింద నదిలో పుణ్యస్నానాలు ఆచరిం చారు. అక్కడే ఉన్న శివుని విగ్రహాన్ని, గంగాదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు.
జ్యోతినగర్, మార్చి 8: ఎన్టీపీసీ, రామగుండం పట్టణంలోని పలు ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని శ్రీ హరిహర దేవాలయం ప్రాంగణంలోని ఉమామహేశ్వరాలయంలో అర్చకుడు రాంపెల్లి వామరశర్మ స్వామివారికి అభిషేకాలు చేశారు. శివ కల్యాణం నిర్వహించారు. టౌన్‌షిప్‌లోని ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే విలేజ్ రామగుండంలోని కాశీవిశ్వేశ్వరాలయం, ఒంకారేశ్వరాలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.