DCP Ram Reddy | ఓదెల, జనవరి 31 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అతి పురాతనమైన కొలనూరు సమ్మక్క సారలమ్మ జాతరను పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ శనివారం దర్శించుకున్నారు. జిల్లాలో పురాతనమైన జాతరగా కొలనూరుకు పేరుంది. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ చుట్టూ గుట్టల నడుమ చెట్లు చెరువుతో ఇక్కడ జాతర ఆహ్లాదకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ జాతరను దర్శించుకోవడం తమకు సంతోషాన్ని ఇచ్చినట్లు తెలిపారు.
ఇక్కడ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చిన తమ పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్, సిబ్బంది సమర్థవంతంగా విధులను నిర్వర్తించి విజయవంతం చేసినందుకు అభినందించారు. ఇందుకు ఎస్సై తో పాటు పోలీసు సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. కాగా జాతరను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులను జాతర ఉత్సవ కమిటీ, గ్రామపంచాయతీ వారు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై రమేష్ గౌడ్, జాతర చైర్మన్ కొలిపాక మధునయ్య, సర్పంచ్ పల్లె కనకయ్య, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జాతరకు మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు భారీగా తరలివచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.