COLLECTOR KOYA SRIHARSHA | ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 27: ఆయన సాదాసీదా వ్యక్తి కాదు.. జిల్లాకే బాస్.. హంగు ఆర్భాటాలకు కొదవ లేకున్నా.. తన సతీమణిని ఖని ప్రభుత్వ ధర్మాసుపత్రి లో ప్రసవం చేపించి, ప్రభుత్వ అసుపత్రులపై నమ్మకం కలిగించారు. ఇతర అధికారులకు ఆదర్శంగా నిలిచారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన విధుల్లో చేరిన నాటి నుంచి విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ క్రమంలో తన భార్య విజయ రెండో కాన్పుకోసం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా గోదావరిఖని ధర్మాసుపత్రిలోనే మొదటినుంచి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పురిటి నొప్పులు రావటం తో శనివారం రాత్రి ఖని ధర్మసుపత్రిలోనే వైద్య బృందం డాక్టర్ అరుణ, లక్ష్మి, స్వాతి, శిరీష, రాజేష్, భానులక్ష్మి లు విజయకు ఆపరేషన్ చేసి ప్రసవం చేయగా పండంటి మగబిడ్డ జన్మించాడు. కాగా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అభినందించారు. దీంతో కలెక్టర్ తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.