Collector Koya Sri Harsha | పెద్దపల్లి, ఆగస్టు22: సాదా బైనామా దరఖాస్తులను హైకోర్టు అనుమతి వచ్చిన తర్వాత పరిశీలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పీవోటీ కేసులలో కొత్త అసైన్మెంట్ భూమి కింద ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు అర్హుల సిద్ధం చేసుకోవాలని సూచించారు. భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారం, భూ భారతి దరఖాస్తుల, ప్రజావాణి దరఖాస్తులు, మీ సేవా దరఖాస్తులు, పెండింగ్ భూ సేకరణ తదితర అంశాలపై కలెక్టర్ మండలాల వారీగా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులకు నోటీసుల జారీ చేసి, దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు బీ గంగయ్య, కే సురేష్ , సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ , తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం విద్యా శాఖపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహిచారు. హై స్కూల్ విద్యా బోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 6-9వ తరగతి విద్యార్థులకు బేసిక్స్ నుంచి నేర్పడం చాలా అవసరమని, ప్రతీ సబ్జెక్టు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలన్నారు. 80 శాతం పిల్లలకు పాఠ్యాంశాలపై కనీస పరిజ్ఞానం ఉండాలని, ఉపాధ్యాయులు ప్రతీ పాఠ్యాంశానికి సంబంధించి టీఎల్ఎం తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, డీఈవో మాధవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.