రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇంకా పారితోషకం అందలేదు. నెలన్నరగా ఎదురుచూస్తున్నా ఖాతాల్లో పడలేదు. సర్వే పూర్తయిన వెంటనే సిబ్బంది ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం మొదట నిధులు విడుదల చేసినా.. ఆ తర్వాత నిలిపివేసింది. నాలుగు రోజుల క్రితం ఎంపీడీవోల ద్వారా పంపిణీకి ఆదేశాలు ఇచ్చినా.. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికొద్ది రోజులు పట్టనున్నది. దీంతో సర్వే సిబ్బందిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 2 : స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన వారి రిజర్వేషన్లు పెంచుతామని చేసిన ప్రకటన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 10వేలకుపైగా సిబ్బందిని సర్వే కోసం వినియోగించుకున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 2,742 మంది ఎన్యూమరేటర్లు, 252 మంది సూపర్వైజర్లు, 2,256 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వర్తించారు. అందులో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సీవోలతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు ఉన్నారు. వీరంతా గత నవంబర్ 9 నుంచి 24 వరకు ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు.
ఆయా కుటుంబాల సమాచారాన్ని ప్రత్యేకంగా ముద్రించిన ఫాంలలో నమోదు చేశారు. ఎలాంటి తప్పొప్పులూ లేకుండా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సర్వే వివరాలు వెబ్సైట్లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారు కూడా నిర్దేశించిన గడువులోపే అప్లోడ్ చేశారు. అప్పగించిన సర్వేను గడువులోపే విజయవతంగా పూర్తి చేసినా, పారితోషికం విడుదల చేయడంలో జాప్యం జరుగుతున్నది. నిజానికి సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు ఒక్కొక్కరికి 10వేలు, సూపర్వైజర్లకు 12 వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రైవేట్ వ్యక్తులైతే ఒక్కో షిప్టుకు 750, ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే కాంట్రాక్టు ఆపరేటర్లకు 350 చొప్పున అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
సర్వే ప్రారంభానికి ముందే నిధులు విడుదల చేసింది. పూర్తి కాగానే సిబ్బంది ఖాతాల్లో జమచేయాలని సూచించింది. అందుకనుగుణంగా చెల్లించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కాగా, ప్రభుత్వం అంతలోనే పాత ఉత్తర్వులు పక్కన పెట్టింది. మండలాల వారీగా సర్వే సిబ్బంది వివరాలు సేకరించి, వారికి చెల్లించాల్సిన మొత్తం ఎంపీడీవోల ఖాతాల్లో జమచేయాలంటూ నాలుగు రోజుల క్రితం (డిసెంబర్ 30న) ఆదేశాలు జారీ చేసింది. అలాగే సర్వే సిబ్బంది నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను మండల పరిషత్ ద్వారా సేకరించి, వారి ఖాతాల్లో జమ చేయాలని సూచించినట్టు తెలుస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో పది రోజులు పట్టనున్నట్టు తెలుస్తుండగా, సర్వే సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుతో పారితోషికం అందించడంలో జాప్యం జరుగుతున్నదని మండిపడుతున్నారు. సర్వే పూర్తి చేసి నెలన్నర దాటుతున్నా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే సిబ్బంది ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేస్తున్నారు.