Collector Garima Agarwal | సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 23: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజన్నసిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రిని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అసుపత్రిలోని సదరం శిబిరంతో పాటు మెటర్నటీ, ఆప్తమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు రక్త పరీక్షల ల్యాబ్లను పరిశీలించారు.
రోగులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు చిత్తశుద్దితో సేవలు అందించాలని అన్నారు. సదరం శిబిరాన్ని సందర్శించి అక్కడికి వివిధ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారితో మాట్లాడారు. సదరం రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు, వివరాల నమోదు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
సదరం శిభిరానికి వచ్చే వారి కోసం మౌళిక వసతులు కల్పించాలని, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, డీఆర్డీవో శేషాద్రి, వైద్యులు సంతోష్ కుమార్, డిపిఎం రవీందర్, మున్సిపల్ కమిషనర్, డీఈ, తదితరులున్నారు.