పెద్దపల్లి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రారంభించబోతున్న గ్వాలియర్ 11085/86వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్లలో స్టాప్ అవకాశం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ను ఎగువ ప్రయాణంలో గ్వాలియర్ టూ బెంగళూర్, దిగువ ప్రయాణంలో బెంగళూర్ ఎస్ఎంవీటీ టూ గ్వాలియర్ దాకా నడిపించనున్నట్టు గత నెల 28న రైల్వే బోర్డ్ డైరెక్టర్ ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇది గ్వాలియర్, గుణ, బైన, భోపాల్, జుజార్‌పూర్, నాగ్‌పూర్, మహారాష్ట్రలోని బల్లార్షా, తెలంగాణలోని కాచీగూడ, ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, బెంగుళూరులోని ఎస్ఎంవీటీ స్టాప్లకు సదుపాయం కల్పించారు.
అలాగే కమర్షియల్‌గా శివపురి, గుణ, అశోక్‌నగర్, బైన, విదిశ, భోపాల్, బేతుల్, నాగ్‌పూర్, సేవాగ్రాం, చంద్రాపూర్, బల్లార్షా, సిర్పూర్కాగజ్నగర్, బెల్లంపల్లి, ఖాజీపేట్, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, ఎలహంకలకు స్టాప్‌లు ఇచ్చారు. కానీ, పెద్దపల్లి, రామగుండం రైల్వే జంక్షన్లలో స్టాప్ ఇవ్వలేదు. పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవించి దాపుగా పదేండ్లు కావస్తున్నా, లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కేంద్రంగా ఉన్నా, పెద్దపల్లి జంక్షన్ ఆదాయంలో ముందున్నా తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జంక్షన్‌ను నాన్-సబ్అర్బన్ గ్రేడ్(ఎన్ఎస్జీ) -5 నుంచి ఎన్ఎస్జీ-4కి ఉన్నతీకరించినా పట్టించుకోవడం లేదని, ఇతర జోన్ల రైళ్లకు స్టాప్ ఇవ్వడం లేదన్నారు. ఆదాయం, రద్దీ తక్కువ ఉన్న స్టేషన్లకు హాల్టింగ్ ఇస్తున్నా పెద్దపల్లికి ఎందుకివ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. రైల్వేలో పెద్దపల్లి జిల్లాకు తీరని అన్యాయం జరుగుతున్నా ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. రైల్వేకు సంబంధించి పెద్దపల్లి, రామగుండం జంక్షన్లలో కనీస సౌకర్యాలు లేకపోవడం, రైళ్ల నిలుపుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పెద్దపల్లి ఎంపీ చొరవ చూపాలని కోరుతున్నారు. పెద్దపల్లి జంక్షన్లో కొత్తగా ప్రారంభించనున్న గ్వాలియర్ 11085/86 వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలుతోపాటు పలు ప్రధాన ఎక్స్‌ప్రెస్‌లకు స్టాప్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.