Parents responsible | పెద్దపల్లి, జూలై5 : జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత వారి సంతానంపై ఉంటుందని, నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలుంటాయని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లో వయో వృద్ధుల సంరక్షణ చట్టం పరిధిలో ఓ కేసును విచారించి తీర్పును శనివారం వెల్లడించారు.
రామగుండం మండలం ఎఫ్సీఐ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడు తన సంక్షేమం, పోషణ చూసుకోవడం లేదని తనని మానసికంగా వేదిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని, తన కుమారుడిని ఇంటి నుంచి ఖాళీ చేయించాలని దరఖాస్తు చేసుకోగా, విచారణ చేపట్టి 30 రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని కలెక్టర్ తీర్పునిచ్చారు.
తీర్పు వివరాలు..
ఎఫ్సీఐ ఏరియాకు చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడు తన సంక్షేమం, పోషణ చూసుకోవడం, మానసికంగా వేదిస్తూ భయబ్రాంతులకు గురిచే స్తున్నాడని, తన కుమారుడిని ఇంటి నుంచి ఖాళీ చేయించాలని పెద్దపల్లి ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోగా, ఇళ్లు ఖాళీ చేయాలని ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదని, తన భర్త నిర్మించిన ఇంటిలో తన మిగిలిన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని తన కుమారుడిని ఇంటి నుంచి ఖాళీ చేయించి న్యాయం చేయాలని కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.
తల్లిదండ్రులు, వయోవృద్దుల పోషణ సంరక్షణ చట్టం 2007 కింద అప్పిలుగా స్వీకరించి, ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. శనివారం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007లోని సెక్షన్ (23) , 21(3)(బీ) ప్రకారం అర్జీదారు భద్రత, శ్రేయస్సు గౌరవాన్ని పరిగణనలోకి తీసుకొని అర్జీదారు కుమారుడు 30 రోజులలో ఇంటిని ఖాళీ చేయాలని, ఇకపై అర్జీదారునకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయరాదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఈ ఆదేశాలను ఉల్లంఘించినచో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే తీర్పు అమలు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి, సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.