Appointed | బోయిన్ పల్లి, మార్చి13 : భువనేశ్వర్ లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొనే తెలంగాణ మహిళల వాలీబాల్ జట్టుకు కోచ్ గా పంతం ప్రభాకర్ వ్యవహరించనున్నట్లు సిరిసిల్ల జిల్లా విలాసాగర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ తెలిపారు. స్వతహాగా వాలీబాల్ క్రీడాకారుడైన పంతం ప్రభాకర్ విలాసాగర్ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత నెల 16 నుండి 20 వరకు వేములవాడలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మార్చి 2 నుండి 12 వరకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ జట్టుకు పంతం ప్రభాకర్ కోచింగ్ ఇచ్చాడు.
దీంతో తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రభాకర్ ను రాష్ట్ర జట్టుకు కోచ్ గా నియమించింది. ఈ జాతీయ స్థాయి పోటీలు భువనేశ్వర్ లో ఈనెల 14 నుండి 20 వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ గత పది రోజులుగా రాష్ట్ర జట్టుకు నిర్వహించిన శిక్షణ శిబిరం ఫలితంగా క్రీడాకారులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్ర జట్టు పటిష్టంగా ఉందని జాతీయ పోటీలో మెరుగైన ప్రతిభ కనబరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంతం ప్రభాకర్ ను జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఎంఈఓ శ్రవణ్ కుమార్, విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనుకయ్య, పాఠశాల హెచ్ఎం బొలగం శ్రీనివాస్ సహా ఉపాధ్యాయులు అభినందించారు.