Vemulawada | వేములవాడ రూరల్, డిసెంబర్ 7: ఆకస్మిక మరణం పొందిన చింతల్టానా సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి గెలుపు కోసం ఆయన తరఫున ప్యానెల్ వార్డుమెంబర్ అభ్యర్థులు గెలుపుతో పాటు సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తీరు అభినందనీయంగా కొనసాగుతోంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ టానా, ఆర్అండ్ఆర్ కాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి స్థానం ఎస్సీ జనరల్ కావడంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా చెర్ల మురళి బరిలో నిలిచారు.
గత శుక్రవారం మురళికి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. సర్పంచ్ అభ్యర్థి మృతి చెందినప్పటికీ ఎన్నికల నియమావళిలో ఎన్నిక యథావిధిగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఫ్యానల్కు చెందిన పదిమంది వార్డుమెంబర్ అభ్యర్థులు పట్టుదలతో స్థానిక నాయకులతో కలిసి విశేష కృషి చేస్తున్నారు. మురళికి గ్రామంలో మంచి పేరు ఉండగా ఆయన మృతి పట్ల గ్రామస్తులు కూడా సానుభూతి వ్యక్తం చేస్తూ మురళి లేకపోయినా ఆయన గెలుపును మాత్రం చూస్తామని అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అభ్యర్థి లేకపోయినా ఆయనకున్న మంచి పేరు ప్యానల్ వార్డుమెంబర్ అభ్యర్థులు ప్రస్తుత ప్రచారం నేపథ్యంలో గ్రామంలో సానుభూతి పవనాలు వీస్తున్నాయి.