పంచాయతీ పోరు తుది అంకానికి చేరుకున్నది. ఇప్పటికే రెండు విడుతల ఎన్నికలు పూర్తి కాగా, నేడు ఆఖరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1226 పంచాయతీలుండగా, కోర్టు కేసు కారణంగా మూడు విడుతల్లో కలిపి మూడు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా మొదటి, రెండో విడుతలో 815 జీపీలో ఎన్నికలు పూర్తి కాగా, బుధవారం మూడో విడుత 386 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేయగా, పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. కాగా, ఉమ్మడి జిల్లాలో మొదటి, రెండో విడుత ఎన్నికల్లో కారు హవా కొనసాగింది. ఈ ప్రభావం మూడో విడుతలోనూ కనిపించే అవకాశముందని రాజకీయ పార్టీ విశ్లేషకులు అంచనా వేస్తుండగా, రెండు విడుతల్లో చాలాచోట్ల హస్తం పార్టీ వెనుకపడి పోయింది. ఇక బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొత్తంగా నేటితో పల్లె పోరు ముగుస్తుండగా, త్వరలోనే పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
కరీంనగర్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరాయి. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే మొదటి, రెండో విడుతలు పూర్తయ్యాయి. చిన్న చిన్న ఘటనలు తప్ప.. దాదాపు ప్రశాంతంగానే ముగిశాయి. నేడు మూడో విడుత నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విడుతల వారీగా చూస్తే.. మొదటి విడుతలో ఉమ్మడి జిల్లాలో 398 పంచాయతీల్లోఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, పెద్దపల్లి జిల్లాలోని కిష్టంపేట పంచాయతీ కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. ఇది పోను 20 ఏకగ్రీవం కావడంతో 377 పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అలాగే రెండో విడుతలో 418 పంచాయతీలకు 26 ఏకగ్రీవం కాగా, 392 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొదటి, రెండు విడుతల్లో కలిపి మొత్తం 815 పంచాయతీల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలిన పంచాయతీలకు నేడు చివరి పోరు జరగనున్నది. ఆఖరి విడుతలో 410 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, సైదాపూర్ మండలంలో కోర్టు కేసు కారణంగా రెండు గ్రామాల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఇవి పోను మిగిలిన 386 గ్రామాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఇవి పూర్తయితే.. ఉమ్మడి జిల్లాలో దాదాపు పంచాయతీ ఎన్నికల పోరు సమాప్తం కానున్నది. కోర్టు కేసుల కారణంగా వాయిదా పడిన పంచాయతీలను ఆ తర్వాత తీర్పులకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని అధికారయంత్రాంగం చెబుతున్నది.

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండో విడుతలో చిన్న సంఘటనలు మినహా దాదాపు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. రెండు విడుతలుగా జరిగిన ఎన్నికల్లో వచ్చిన అనుభవాలు, దొర్లిన చిన్న చిన్న తప్పులు సైతం తిరిగి పునరావృతం కాకుండా మూడో దశ ఎన్నికలకు ఏర్పాట్లు చేసినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. పోలింగ్ సిబ్బంది, బూత్‌ల వంటి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. పర్యవేక్షణ కోసం ప్రతి పోలింగ్ బూత్కేంద్రం పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండగా, ఆలోగా సిబ్బంది అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక పోలీస్ అధికారులు కూడా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నిషేధాజ్ఞలను ఇప్పటికే అమల్లోకి తెచ్చారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో చూస్తే కారు బలం చెక్కు చెదరలేదు. పల్లెప్రజల గుండెల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతున్నది. పలు మండలాల్లో అధికార పార్టీకి మించి పంచాయతీలు సాధించి.. తన సత్తాను చాటింది. నిజానికి గత చరిత్ర చూస్తే.. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు, విజయం సాధించిన స్థానాల్లో ఎనభైశాతం అధికార పార్టీ ఖాతాలో ఉంటుంది. కానీ, ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్కు చెక్ పెట్టి, గెలువకుండా చేయడానికి అధికార పార్టీ అనేక రకాలుగా ప్రయత్నించించింది. నోటిఫికేషన్‌కు వారం ముందు నుంచే ఆశలు చూపింది. ప్రధానంగా మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు వడ్డీ లేని రుణాల ఎర వేసింది. భారీ ఎత్తున రుణాలు ఇస్తున్నట్టు ప్రచారం చేసింది. బతుకమ్మ చీరలను ఆగమేఘాల మీద పంపిణీ చేసింది. అధికారులు పంపిణీ చేయాల్సిన చోట పార్టీ నాయకులే దగ్గరుండి అందజేసి, వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలంటూ ప్రచారం కూడా చేసుకున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి, పంచాయతీ ఎన్నికలకు పరోక్ష ప్రచారం చేశారు. అయినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్కే అండగా నిలిచారు. అందుకు మొదటి, రెండు విడుతల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ప్రభావం మూడో విడుత ఎన్నికల్లోనూ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ జోరు ఇంకా పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.