బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. రాష్ట్ర సచివాలయం, అమర జ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ సర్కారు తీరుకు నిరసనగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. ఇది సరైన నిర్ణయం కాదని, వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలని డిమాండ్ చేశారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ సంఘం ఐలయ్య ఆధ్వర్యంలో, సైదాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, నాయకులు కలిసి తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించారు.
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ, సాయిల్ల కొమురయ్య, పాశం అశోక్ రెడ్డి, తదితరులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ జిల్లా, పట్టణ అధ్యక్షుడు తోట ఆగయ్య, జిందం చక్రపాణీ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, బొల్లి రాంమోహన్, కౌన్సిలర్లు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.