Godavarikhani | గోదావరిఖని : పహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తదితరుల ఎన్ కౌంటర్ హత్యలపై సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా పెద్దపెల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్ లోయలో ఉగ్ర దాడి జరిగిందని , దాడి చేసిన వారిని ఇప్పటికి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని, ఆపరేషన్ సింధూర్ లో యుద్ధం అర్ధాంతరంగా ముగింపును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంలో అంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. అమెరికా సామ్రాజ్యవాద అధినేతకు అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. ప్రపంచంలో అతి పెద్ద దేశమైన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత పార్లమెంటులో కానీ, దేశములోని విపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి కానీ, చర్చించకుండా నేరుగా యుద్ధ విరమణ ప్రకటన ట్రంపు చేయడం, నరేంద్ర మోడీ మౌనవ్రతం పాటించడం పరిశీలిస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లొంగిపోయి మోకరిల్లినట్లుగా ఉందని ఆయన అన్నారు.
ఐఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్ట వద్ద ఏకపక్ష దాడులు చేసి, ఆదివాసులను, మావోయిస్టులను చంపుతున్నారని ఆయన ఆరోపించారు. అడవిలో ఉన్న ఖనిజ, ప్రకృతి సంపదను కార్పొరేట్ అధిపతులకు అప్పజెప్పె రహస్య ఒప్పందంలో భాగంగా ఆదివాసులను భయభ్రాంతులకు మోడీ సర్కార్ గురి చేస్తుందని ఆయన మండిపడ్డారు. నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలు నల్ల డబ్బు వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జామా, ప్రతి ఏటా రెండు కోట్ల కొలువులు, ఉపాధి భద్రత, రైతుల ఆదాయం రెట్టింపు, భేటీ పడావో బచావో , ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ,సుస్థిర పాలన లాంటి హామీలను అమలు చేయకుండా, ప్రజలు ప్రశ్నిస్తారని, ప్రజల ఆలోచనను వక్ర మార్గం పట్టించే కుట్ర చేస్తున్నారని అన్నారు.
ఈ సదస్సుకు సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు ఏ వెంకన్న, చిలుక శంకర్, ఈ రామకృష్ణ , ఐ రాజేశం, మెరుగు చంద్రయ్య, రైతు సంఘం నాయకులు మునిమడుగుల మల్లయ్య, జీ మల్లేశం, డి బుచ్చమ్మ, కొల్లూరి మల్లేష్, బీ బుచ్చయ్య, ఎం దుర్గయ్య,పుట్ట స్వామి,ఎడ్ల రవికుమార్, బి కొమరయ్య, చింతల శేఖర్ ఎస్ ప్రసాద్ బండ పద్మ, పి లక్ష్మి, విజయలక్ష్మి తదితరుల తో పాటు 200 మంది పాల్గొన్నారు.