కరీంనగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్ : బీసీ కమిషన్ రాజకీయాలకు అతీతంగా ఏర్పడిందని చెప్పిన చైర్మన్ మాటలు ఆచరణలో మాత్రం కనిపించ లేదనే విమర్శలు వచ్చాయి. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, 42 శాతం అమలు చేయకుంటే తమ పార్టీ పక్షాన ఆందోళన తప్పదని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు.
పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే మాట్లాడాలనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ వాదనకు దిగారు. కొద్దిసేపు ఎమ్మెల్యేలు వాదించినా ఒక్క కౌశిక్‌రెడ్డికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతుండగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు బీసీ నాయకులు ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గో బ్యాక్’ అంటూ నినదించారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడే ప్రయత్నం చేయగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అడ్డుకున్నారు.
తర్వాత కలెక్టర్ ఆడిటోరియం నుంచి బయటికి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ, ఇది విచారణ కమిషన్‌గా కనిపించడం లేదని, కాంగ్రెస్ విచారణ కమిటీగా కనిపిస్తున్నదని విమర్శించారు. ఈ కమిషన్ చెల్లదని కోర్టు డైరెక్షన్ ఇచ్చినా ఈ బహిరంగ విచారణ దేనికని ప్రశ్నించారు. ఎవరైనా కోర్టుకు వెళ్లితే విచారణలో తీసుకున్న అభిప్రాయాలన్నీ కొట్టివేస్తారని అన్నారు.
బీసీ కమిషన్‌కు కోర్టు వాలిడిటీ లేదన్నప్పటికీ విచారణలో బీసీల పక్షాన తమ వాదనను విన్నవించాలనే గౌరవంతో నేను కౌశిక్ రెడ్డి వచ్చాం. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కనీసం సమయం ఇవ్వలేదు. ఇది కమిషన్ విచారణలా లేదు. కాంగ్రెస్ పార్టీ విచారణలా కనిపించింది. జిల్లాలో కేవలం బీఆర్ఎస్ పక్షాన మాత్రమే మేం కలిసేందుకు వచ్చాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అది నెరవేరకుంటే ప్రజలతో కలిసి పోరాడుతాం.
ఈ కమిషన్ నిజాయితీతో పనిచేస్తున్నదా..? లేదా అనే అనుమానం వస్తున్నది. నిజాయితీగా పనిచేస్తోందంటే ఏ కాంగ్రెస్ ఒక్క నాయకుడు కూడా ఇక్కడికి ఎందుకు రాలేదు? కోర్టు చెప్పిన విధంగా ప్రత్యేక కమిటీ వేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ కమిషన్‌పై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రత్యేక కమిషన్ వేయాల్సిందే. ఒక ఎమ్మెల్యే అభిప్రాయం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుంటే ఇక సామాన్య బీసీలకు విలువ ఎక్కడిది?
– డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల ఎమ్మెల్యే
బీసీ కమిషన్ చెల్లదని నిన్ననే కోర్డు డైరెక్షన్ ఇచ్చింది. రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టింది. కేవలం రాజకీయం కోసం తప్పితే ఈ కమిషన్ విచారణలో ఎక్కడా చిత్తశుద్ధి కనిపిస్తలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది తూతూ మంత్రంగా చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తున్నది. కమిషన్ ముందు హాజరై వాదనలు వినిపించాలని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపింది. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ ఎందుకు రాలేదు? కోర్టు ఒకటి చెబితే, ప్రభుత్వం ఒకటి చెప్తున్నది.
రేపు ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తే ఇప్పుడు చేసే ప్రజాభిప్రాయాన్ని కొట్టి వేయరన్న గ్యారెంటీ ఏంటీ? బీసీల సంక్షేమంపై కేవలం కేసీఆర్‌కు మాత్రమే చిత్తశుద్ధి ఉంది. మా పార్టీ పక్షాన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. సంజయ్ ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వక పోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినపుడు బీసీలకు రూ. లక్ష కోట్లు పెడతామని చెప్పింది. మొన్న బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు. బీసీ కమిషన్ విచారణ మొత్తం రాజకీయ డ్రామాగా చెప్పవచ్చు.
– పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే