హుజూరాబాద్ టౌన్, మార్చి 5: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల గొంతుకలం అవుదామని, హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీద్దామని, ఆ పార్టీ వైఫల్యాలపై నాయకులను ప్రజాక్షేత్రంలో ఎండగడుదామని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో అందరం కష్టపడి పనిచేద్దామని, హుజూరాబాద్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు.
హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఇల్లంతకుంట మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడువకముందే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్కు ఆదరణ పూర్తిస్థాయిలో ఉందని ఆయన అన్నారు.
తెలంగాణకు కేసీఆర్ అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారని, మరోసారి ఆయన సీఎం కావాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల్లో పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను నిలదీస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతున్నారని, అక్రమంగా అరెస్ట్ చేస్తే నియోజకవర్గం మొత్తం నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. మార్చి 10 వరకు అన్ని గ్రామాల్లో వివిధ కమిటీలు వేయాలని నాయకులకు సూచించారు. తనకు అండగా నిలబడిని అందరినీ గెలిపించుకునే బాధ్యత తనదేనని అన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞత తెలిపేందుకు ఏప్రిల్‌లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తానని చెప్పారు. సమావేశంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రామస్వామి, సీనియర్ నాయకులు చుకా రంజిత్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొమురెల్లి, ఇల్లంతకుంట మండల నాయకులు పాల్గొన్నారు.