వేములవాడ/ బోయినపల్లి, నవంబర్ 7: రాష్ట్ర సాధనకు ముందు ‘అన్నమో రామచంద్రా..’ అన్న రైతులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అండగా నిలిచి పూర్వవైభవం తెచ్చారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో వ్యవసాయరంగం బలోపేతమైందని, ఈ రోజు ప్రతి రైతు ఇంటా సిరులు పండుతున్నాయని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) విజయం సాధించిన సందర్భంగా తన సతీమణి మాధవితో కలిసి ఆయన సోమవారం శ్రీరాజరాజేశ్వరస్వామివారికి మొ క్కులు చెల్లించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించారు.
పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. వచ్చేతరం కోసం దేశంలో ఎన్నికల విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజన్న ఆలయ అతిథి గృహం లో విలేకరులతో అభిప్రాయపడ్డారు. అనంతరం బోయినపల్లి మండలం కోరెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులతో వినోద్ మాట్లాడారు. రైతులు పెట్టుబడి ఎంత పెట్టారు? దిగుబడి ఎంత వచ్చింది? మద్దతు ధర, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మా ట్లాడారు.
రాష్ట్రం రాక ముందు అప్పటి దళారులు ‘ఆడిందె ఆట పాడిందె పాట’ అన్నట్లుగా వ్యవహరించారని, ఆరుగాలం కష్టపడి పండించిన పండించిన పంటను అమ్ముకునేందుకు దళారులే దిక్కయ్యారని చెప్పారు. కానీ, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారని, ఉన్న ఊళ్లోనే మద్దతు ధరతో దాన్యం కొంటూ దళారులకు చెక్ పెట్టారని చెప్పారు. వ్యవసాయ అధికారులు రైతులకు వెన్నుదన్నుగా నిలిచి విలువైన సలహాలు ఇవ్వాలని సూచించారు. వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో రాజన్న ఆలయ ఆవరణలో చేపట్టిన భక్తులకు ఉచిత పాల పంపిణీ కార్యక్రమానికి కూడా వినోద్ హాజరై అభినందించారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు పుల్కం రాజు, గోస్కుల రవి, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, నాయకులు రామతీర్థపు రాజు, ఈర్లపల్లి రాజు, రాఘవరెడ్డి, క్రాంతికుమార్, పీర్ మహమ్మద్, టైలర్ శ్రీనివాస్, వాసాల శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. త్వరలోనే ఆయల అభివృద్ధిపై కేసీఆర్ సమీక్షిస్తారు. ఎవరో అడిగితే చేస్తున్నది కాదు. అభివృద్ధిలో భాగంగానే ఈ ఆలయాల అభివృద్ధికి అంకురార్పణ జరిగింది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 32శాతం ఓట్లు వచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. నరేంద్రమోడీ దేశాన్ని పరిపాలిస్తున్నారు. 68శాతం ప్రజలు పార్టీని తిరస్కరించారు. అయినా దేశాన్ని పాలించే అవకాశం రావడం ఎన్నికల విధానం వల్లే జరిగింది. రాబోయే తరం కోసమైనా ఎన్నికల విధానాల్లో మార్పు చేయాల్సిన అవసరమున్నది. ఇతర దేశాల్లోలాగ పార్టీకి వచ్చే ఓట్లను బట్టి అభ్యర్థులను పాలించే స్థాయికి చేర్చాలి. మేధావులు ఈ విషయంపై చర్చించాల్సిన అవసరమున్నది.
– రాజన్న అతిథి గృహంలో విలేకరులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే
వేములవాడ రాజేశ్వరస్వామి దివ్య ఆశీస్సులు ఉన్నంతవరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. అభివృద్ధి సంక్షేమం చూసే మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు సరైన తీర్పునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది.
– న్యాలకొండ అరుణ, రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్
బీజేపీకి చెంపపెట్టు లాంటిది
మనుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి గెలుపు బీజేపీకి చెంపపెట్టు లాంటిది. గడిచిన ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకున్నందునే సరైన తీర్పునిచ్చారు. మునుగోడు ఎన్నిక కోసం పనిచేసిన జిల్లా ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు.
– తోట ఆగయ్య, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు