తిమ్మాపూర్, ఏప్రిల్24: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లం నుంచి దొంగలు దోచుకెళ్లారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన ముంజ రాములు అనే రైతు ఇటీవల వరి కోసి, అమ్ముకునేందుకు తేమ శాతం రావడానికి గ్రామంలో ఖాళీ స్థలంలో ఆరబెట్టుకున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి సమయంలో రాశి నుంచి సుమారు 60 బస్తాల వరకు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. గుర్తించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమారు రూ.50 వేల వరకు నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ధాన్యం ఎక్కడబడితే అక్కడ ఆరబోశామని, ఇలాంటి సంఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదని గ్రామస్తులు వెళ్లడించారు. ధాన్యం చోరీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత రైతుతో పాటు స్థానికులు కోరుతున్నారు. కాగా.. కొన్ని రోజులుగా అలుగునూర్లో ద్విచక్ర వాహనాలు సైతం చోరీకి గురవుతున్నట్లు తెలిపారు. వరుసగా జరుగుతున్న చోరీలతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు.