కరీంనగర్‌లోని పలు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఇప్పుడు ప్యాకేజీల సీజన్ నడుస్తున్నది. ఓ హాస్పిటల్ అయితే జస్ట్ 999కే ఆరు రకాల వైద్య పరీక్షలు చేస్తామని, కన్సల్టేషన్ ఫీజు ఉచితమని ప్రకటించింది. మరో హాస్పిటల్ అయితే కంటికి ఉచిత వైద్యం చేస్తామంటూ ప్రచారం చేసింది. 499కే ఇంటిలో ఇద్దరికి వైద్య పరీక్షలని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్, 399కే మీ ఇంటికి వచ్చి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని ఇంకో డయాగ్నోస్టిక్ సెంటర్ సామాన్యులను మాయలో పడేస్తున్నాయి.
ఇలాంటి ఆఫర్లను చూసి తక్కువ ఖర్చుతో ఎక్కువ టెస్టులు చేయించుకోవచ్చని ఆశ పడుతున్న ప్రజలకు, ఆ తర్వాతే చుక్కలు చూపుతున్నాయి. డాక్టర్లు చెప్పకున్నా.. అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ.. ఆ తర్వాత భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. పరీక్షల తర్వాత ఏదో ఒక సమస్య ఉందని భయపెట్టడం, శస్త్రచికిత్సలు అవసరమని చెప్పడం, లేదంటే ఖరీదైన మందులు రాయడం, ఏదీ లేకుంటే భవిష్యత్‌లో వ్యాధుల ముప్పును చూపడం చేస్తూ అధిక మొత్తంలో గుంజుతున్నాయి. ఈ ఉచ్చులో చిక్కితే అసలుకే మోసం వస్తుందని, ఆరోగ్యంతోపాటు ఆర్థికంగా నష్టపోయే ముప్పు ఉంటుందని పలువురు సీనియర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా మేరకే పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో నానాటికీ విస్తరిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లు రోగులను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కొన్ని హాస్పిటళ్లు ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీల పేరిట రోగులకు వల వేసి దండుకుంటున్నాయి. అవసరం లేకున్నా అడ్డగోలు పరీక్షలు చేయడం, సాధారణ పరీక్షలకు కూడా అధిక ధరల ప్యాకేజీలో చేర్చడం, వారి మెడికల్ షాపులో మాత్రమే దొరికే మందులు రాయడం చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నాయి.
కన్సల్టెడ్ డాక్టర్ లేకున్నా కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ప్యాకేజీలు పెట్టి టెస్టులకు ఎగబడుతున్నాయి. 499కే ఇంట్లో ఇద్దరికి వైద్య పరీక్షలని, 399కే పలు వైద్య పరీక్షలని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రచారం చేసుకుంటున్నాయి. వీటిని నమ్ముతున్న జనం ‘తక్కువ ఖర్చే కదా!’ అని భావించి పరీక్షల కోసం వచ్చి వైద్యులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు విసురుతున్న వలకు చిక్కుతున్నారు. ఉచిత పరీక్షల పేరిట ఆకట్టుకుని తీరా పరీక్షల తర్వాత వైద్యులు, ఎలాంటి రోగాలు లేకున్నా ఏదో ఒక చిన్న లోపాన్ని పట్టుకుని భయపెడుతున్నారు. కంటికి సంబంధించిన ఓ కార్పొరేట్ హాస్పిటల్లో అయితే పూర్తి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రిపోర్టులు చూసి తమ మెడికల్ షాపులో మాత్రమే లభించే మందులు రాస్తున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైతే వరంగల్‌కు తీసుకెళ్లి చేస్తున్నారు.
కరీంనగర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన ఆంజనేయులు ఇటీవల ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లాడు. 999 ప్యాకేజీలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. లిపిడ్ ప్రొఫైల్, కియేటినిన్, ఆర్బీఎస్తోపాటు గుండెకు సంబంధించిన ఈసీజీ, 2డీ ఈకో, పరీక్షల తర్వాత అదే హాస్పిటల్‌లోని కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న కన్సల్టెడ్ డాక్టర్‌ను కలిశాడు. రిపోర్టులు పరిశీలించిన డాక్టర్‌కు ఆంజనేయులు గుండె పనితీరుపై అనుమానం వచ్చింది. వెంటనే టీఎంటీ టెస్ట్ చేయించాడు. రిపోర్టులు చూడగానే నీకు 85 శాతం హార్ట్ స్ట్రోక్ వచ్చే చాన్స్ ఉందని తేల్చేశాడు.
అంతే కాకుండా వెయ్యి విలువైన మందులు రాసి ఐదు రోజులు వాడిన తర్వాత తన వద్దకు రావాలని, ఆంజియోగ్రాం చేసి గుండెను మరోసారి పరీక్షించాలని చెప్పాడు. తాను రాసిన మందులు ఎక్కువ రోజులు వేసుకుంటే గుండెకు ప్రమాదమని కూడా భయపెట్టాడు. నిజంగానే ఆంజనేయులుకు గుండెపోటు వచ్చినంత పనైంది. ఆ వైద్యుడి మాటలు విశ్వసించని ఆంజనేయులు సెకండ్ ఒపీనియన్ కోసం కరీంనగర్‌కు చెందిన మరో కార్డియాలజిస్ట్‌ను కలిశాడు. ఆ వైద్యుడు ఆంజనేయులును సీటీస్కాన్ ఆంజియోగ్రాం చేయించుకోవాలని సూచించగా.. 15 వేలు వెచ్చించి ఈ పరీక్ష చేయించుకుని తిరిగి వైద్యుడి వద్దకు వెళ్లాడు. నీ గుండెకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. పలు హాస్పిటళ్లలో అమలు చేస్తున్న ప్యాకేజీల కారణంగా ఒక్క ఆంజనేయులు లాంటి వారెందరో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటారు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
దెబ్బతింటున్న విశ్వసనీయత
తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు నిర్వహించడం మంచిదే. సామాన్యులు ఈ విధంగానైనా వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశముంటుంది. కానీ, కొందరు హాస్పిటళ్ల కారణంగా వీటిపై విశ్వసనీయత దెబ్బతింటున్నది. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్య పరీక్షలను తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చామని చెప్పుకొంటున్నా.. అందులో సామాజిక సేవ కంటే వ్యాపారాపేక్షనే ఎక్కువగా ఉంటున్నట్టు స్పష్టమవుతున్నది. తక్కువ ఖర్చుతో ఆదరాబాదరగా చేసే పరీక్షల్లో విశ్వసనీయత కూడా లేకుండా పోతున్నది.
ఉదాహరణకు కరీంనగర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి నగరంలోని కార్పొరేట్ హాస్పిటల్లో చేసిన పరీక్షలే నిదర్శనం! ఆంజనేయులు అప్రమత్తతతో సెకండ్ ఒపీనియన్‌కు వెళ్లడంతో సరిపోయింది. లేదంటే ఆయనకు ఆంజియోగ్రాం చేసేవారని స్పష్టంగా తెలుస్తున్నది. నిజానికి ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్న ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ కొడుకు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. మీకు 85 శాతం హార్ట్ స్ట్రోక్ వచ్చే చాన్స్ ఉందని భయపెట్టింది ఈ డాక్టరే. అయితే సెకండ్ ఒపీనియన్లో ఆంజనేయులు గుండెకు ఎలాంటి చికిత్స చేయాల్సిన అవసరం లేదని తేలడం చూస్తే.. కొందరు డాక్టర్లు సామాన్యులను ఏ విధంగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
డాక్టర్ సలహాతో చేసే పరీక్షలే మేలు
ప్యాకేజీలు, ఉచితం పేరిట వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది కాదని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముందు సంబంధిత డాక్టర్ కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుంటేనే సరిపోతుందని చెబుతున్నారు. ప్యాకేజీలో తక్కువ ఖర్చుతో చేస్తున్నారు కదా! అని అవసరం లేని పరీక్షలు చేయించుకుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ప్యాకేజీల ద్వారా చేసే వైద్య పరీక్షలు ఏమేరకు నాణ్యమైనవనే చర్చ కూడా జరుగుతున్నది. 10 నుంచి 12 గంటల తర్వాతగానీ వెల్లడించని కొన్ని పరీక్షల ఫలితాలను గంట, రెండు గంటల్లో తేల్చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగా కూడా తప్పుడు రిపోర్ట్లు వచ్చే అవకాశం లేకపోలేదని పలువురు వైద్యులే చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు రిపోర్టులను నమ్మి, కొందరు వైద్యులు చెప్పినట్టు వింటే అసలు ఆరోగ్యానికే ఎసరు వచ్చే ముప్పు ఉంటుంది. అంతే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్యాకేజీల మాయలో చిక్కి భయబ్రాంతులకు గురి కావద్దని, ఆర్థికంగా నష్టపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.