GodavariKhani | కోల్ సిటీ, మే 25: గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలో గల పోచమ్మ మైదానంలో మళ్లీ రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలుస్తున్నాయి. రెండు రోజులకు ముందు ఖాళీగా కనిపించిన జాగలో ఆదివారం హఠాత్తుగా దుకాణాలు ప్రత్యక్షమయ్యాయి. పోచమ్మ మైదానంలో గతంలో అక్రమ నిర్మాణం పేరిట కూల్చివేసిన భవనం స్థానంలో అనుమతులు లేకుండా కొత్త నిర్మాణాలు జరుగుతుండటం పట్ల ఆరోపణలు వెల్లువెత్తాయి.
గతంలో చౌరస్తా కు అటు వైపు గల ఆరు దుకాణాలు కూల్చివేసినందుకు బాధితులకు ఇటు దిక్కు పోచమ్మ మైదానంలో మొదట ఆరు షెట్టర్లను నిర్మించి ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా… ఆ ఆరు షేటర్లు రాను రానూ పది షట్టర్లకు విస్తరించాయి. వడ్డించేవాడు మనోడైతే ఏ మూలకైనా జాగను ఆపుకోవచ్చన్న చందంగా రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో దశాబ్దాల కాలంగా ఉన్న మొబైల్ షాపులను రోడ్ల వెడల్పు పేరుతో అర్ధంతరంగా కూల్చివేశారు. ప్రస్తుతం ఆ బాధితులు ఏలాంటి వ్యాపారాలు లేకుండా జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన చౌరస్తాలో చూస్తుండగానే రోజు రోజుకూ కొత్త నిర్మాణాలు వెలుస్తుండటం పట్ల ఇదెక్కడి న్యాయమంటూ కూల్చివేతల బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు కూల్చివేతలు.. మరో వైపు ఆక్రమ నిర్మాణాలు సాగుతుంటే సంబంధిత నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూడటం పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.ఆరుణ శ్రీని వివరణ కోరగా, పోచమ్మ మైదానం ప్రాంతంలో కార్పొరేషన్ నుంచి నిర్మాణాలకు ఏలాంటి అనుమతులు ఇవ్వలేదనీ, ఒకవేళ అక్కడ కొత్త నిర్మాణాలు జరిగితే టౌన్ ప్లానింగ్ విభాగంతో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.