మరో వారం రోజుల్లో విద్యా సంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పాఠశాల బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉన్నా.. చాలా యాజమాన్యాలు తమ బస్సులను ఫిట్నెస్ చేయించుకోవడానికి మొరాయిస్తున్నాయి. అయితే పాఠశాలల పునఃప్రారంభానికి వారమే గడువు ఉందని, ఆలోగా ఫిట్నెస్ చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
తిమ్మాపూర్, జూన్ 4 : ఉమ్మడి కరీంనగర్లో 2,057 బస్సులు పాఠశాలల కోసం రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు ఫిట్నెస్ కండీషన్ పూర్తయినవి 700 వరకు మాత్రమే ఉన్నాయి. ఇంకా 1300కు పైగా బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంది. వీటిలో 358 బస్సులు 15 ఏళ్లు దాటిపోగా, వాటిని ఫిట్నెస్ చేయించడానికి వీలుండదు. కరీంనగర్ జిల్లాలో 1,108 బస్సులకు 350 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పూర్తయ్యాయి.
మిగతా వాటిలో 291 బస్సులు 15 ఏళ్లు దాటిపోయింది. అలాగే, జగిత్యాల జిల్లాలో 514 బస్సులు ఉండగా 180 వరకు బస్సులను ఫిట్నెస్ చేయించుకున్నారు. మిగతా వాటిలో 44 బస్సులు 15 సంవత్సరాలు దాటిపోయింది. పెద్దపల్లి జిల్లాలో 274 బస్సులు ఉండగా కేవలం 60 వరకు మాత్రమే ఫిట్నెస్ పూర్తయింది. మిగతా వాటిలో 18 బస్సులు 15 సంవత్సరాలు దాటిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 161 బస్సులు ఉండగా 60 వరకు మాత్రమే ఫిట్నెస్ పూర్తయింది. మిగతా వాటిలో 5 బస్సులు 15 ఏళ్లు దాటిపోయింది.
మరో వారం రోజులే..
పాఠశాలలు పునఃప్రారంభానికి మరో వారం రోజులే గడువే ఉన్నా చాలా వరకు పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ చేయించడం లేదు. దాదాపు ఇప్పటి వరకు ఉన్న సంఖ్యలో పావు వంతు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నారు. చాలా మంది యజమానులు ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నారు.
ఫిట్నెస్ లేకపోతే కేసులు
తిమ్మాపూర్లోని రవాణా శాఖ కార్యాలయానికి ఫిట్నెస్ తనిఖీ కోసం పాఠశాల బస్సులను తీసుకొస్తున్నారు. అయితే ఈ బస్సులను రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. పాఠశాలల చిన్నారులను భద్రంగా గమ్యానికి తీసుకెళ్లడానికి కావాల్సిన అన్ని వసతులు, కండీషన్ ఉంటేనే ఫిట్నెస్ రెన్యువల్ చేస్తున్నారు. లేదంటే తిరిగి పంపిస్తున్నారు. టైర్లు, లైట్లు, సీట్లు, రేడియం, కలర్, నెంబర్ప్లేట్, ఇలా ప్రతీ ఒక్కటీ చెక్ చేస్తున్నారు. డ్రైవర్ల అనుభవం, స్కిల్ టెస్ట్ చేయిస్తున్నారు.
పలు సూచనలు ఇస్తున్నారు. ఫిట్నెస్ లేకుండా బడి బస్సులు రోడ్డుపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫిట్నెస్ లేకుండా కనిపిస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. గత సంవత్సరం అనేక సంఖ్యలో బస్సులను సీజ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకుని ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెబుతున్నారు.
రోడ్డెక్కితే కఠిన చర్యలు
పాఠశాలలు, కళాశాలలు త్వరలో ప్రారంభం కానున్నా ఇప్పటికీ చాలా విద్యా సంస్థల వాహనాలను యజమానులు ఫిట్నెస్ చేయించుకోవడం లేదు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత స్పెషల్ డ్రైవ్ చేపట్టి సామర్థ్య ధ్రువీకరణ పొందని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్క బస్సు అన్ని నిబంధనలకు లోబడి ఉండాలి. అలాగే, ఫిట్నెస్ కోసం వచ్చే వాహనాలకు ఏ ఒక్క పరికరం లేకున్నా నోటీస్ ఇచ్చి రిపేర్ చేసుకొని రమ్మంటున్నాం. అన్ని విద్యాసంస్థల వాహనాలు పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఫిట్నెస్ చేయించుకోవాలి.
– శ్రీకాంత్ చక్రవర్తి, డీటీవో