వేములవాడ, జూలై 7: వేములవాడ రాజన్న ఆలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. ఆ ఉద్యోగాలు ఏవైనా సరే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులతోనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలైనా.. కాంట్రాక్ట్ ఉద్యోగాలైనా భర్తీ విధానంలో పారదర్శకత ఉండాలని, ఆలయంలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి పత్రిక ప్రకటన ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.
విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికే జరిగిన నియామకాలపై విచారణ జరిపించి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు గతంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్థానిక యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ విషయాన్ని పకన పెట్టి, పలువురు మంత్రుల సిఫారసులతో భర్తీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
అడ్డదారుల్లో పోస్టులను భర్తీ అవుతుంటే.. స్థానిక యువతకు అన్యాయం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు లేదా..? అని ప్రశ్నించారు. జిల్లాలో వేలాది మంది నిరుద్యగ యువతీ యువకులున్నారని, ఔట్సోర్సింగ్ పోస్టులకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. అయితే స్థానికులను కాదని ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దీంతో అర్హులైన నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని వాపోయారు. ఇప్పటికే మంత్రుల సిఫారసులతో భర్తీ అయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.