ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే అల్యూమినియం గిన్నెలతో ప్రమాదం పొంచి ఉన్నది. ఏండ్లుగా ఆ పాత్రలను వాడుతుండడంతో అవి విషతుల్యమయ్యే ముప్పు కనిపిస్తున్నది. మూడునాలుగేండ్లకు ఒకసారైనా వాటిని మార్చాలని, లేదంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదమున్నదని నిపుణులు చెబుతున్నా నిర్లక్ష్యం వెంటాడుతున్నది. కొత్త కుకింగ్ సామగ్రికి నిధులు వచ్చి నాలుగు నెలలైనా పాత్రలు అందజేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు తాగునీటి స్వచ్ఛత అంతంతమాత్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. నాడు కేసీఆర్ సర్కారు అందించిన మిషన్ భగీరథ కనెక్షన్లు మరిచి పూర్వ పద్ధతిలోనే బోర్లు, పాత ట్యాంకుల ద్వారానే నీటిని అందిస్తుండడం పలు సమస్యలకు దారి తీస్తుండగా, ఇప్పటికైనా యంత్రాంగం మేలుకోవాల్సి ఉన్నది.
జగిత్యాల, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సర్కారు ఆధీనంలో నడిచే విద్యాలయాలు కొన్నాళ్లుగా పలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం వికటించడం, చిన్నారులు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం, వారిని దవాఖానకు తరలించడం, చికిత్స పొందుతూ, కొందరు మృత్యువాత పడుతుండడం కొన్నాళ్లుగా వినిపిస్తున్న ముచ్చట్లే. మిడ్డే మీల్స్ అందించే సాధారణ ప్రభుత్వ పాఠశాలలు మొదలు కొని గురుకులాల్లో ఇటీవల పలు ప్రమాదకరమైన ఘటనలు చోటు చేసుకోగా, వాటికి హెచ్ఎంలను, టీచర్లను బాధ్యుల్ని చేస్తూ సస్పెండ్ చేయడం వంటి చర్యలు జరిగాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల గురుకులాల్లో భోజన మెనూను మార్చివేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో కమిటీల ఆధ్వర్యంలో మిడ్డే మీల్స్ తయారు చేయాలని ఆదేశించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యాలయాలను పరిశీలించి, భోజనం రుచిని, శుచిని పరిశీలించాలని హుకుం జారీ చేసింది. అయితే ఎన్ని చేసినా, ఎన్ని నిబంధనలు పెట్టినా అసలు వంట పాత్రలు శుభ్రంగానే ఉన్నాయా..? అవి కుకింగ్కు యోగ్యమేనా..? పాఠశాలల్లో పిల్లలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉందా..? అన్న ప్రాథమిక అంశాలను మాత్రం పరిశీలించడం లేదు. మెజార్టీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీ పాత్రలు కాలం చెల్లిపోయాయి. అల్యూమినియం కోటింగ్ పోయి, పాచిపట్టిపోయిన వంట పాత్రల్లోనే ఏండ్లుగా భోజనం తయారు చేసి పెడుతుండడం, స్వచ్ఛమైన తాగునీరు సైతం లేకుండాపోగా, పిల్లల ఆరోగ్యం గాలిలో దీపంగా మారిపోయింది.
రాయికల్ మండలంలోని ఓ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల అది. దాదాపు పదిహేనేండ్లుగా ఆ స్కూల్లో మిడ్డేమీల్స్ తయారు చేసిన మహిళా సంఘ ఏజెన్సీ, రెండేండ్ల కిందట తమకు గిట్టుబాటు కావడం లేదని తప్పుకున్నది. అధికారులు మరో ఏజెన్సీకి తయారీ బాధ్యతలను అప్పగించారు. వంట చేయడం ఆరంభిస్తామని, పాత్రలు కావాలని విద్యాశాఖ అధికారులను అడుగగా, పాత ఏజెన్సీ వాళ్లను అడుగాలనడంతో వారిని సంప్రదించారు. తాము సొంతంగా పాత్రలు కొనుక్కున్నామని, ఇవ్వలేమని చెప్పేశారు. హైస్కూల్ కావడం, విద్యార్థుల సంఖ్య కొంత ఎక్కువగా ఉండడంతో భోజన తయారీకి పాత్రలు కొనాలంటే ఎక్కువ డబ్బులవుతాయని, తమ వద్ద అంత పెట్టుబడి లేదని కొత్త ఏజెన్సీ పేర్కొనడంతో చిక్కులు మొదలయ్యాయి. విధి లేని పరిస్థితిలో సర్పంచ్ అన్నం వండే గిన్నెను సమకూర్చాడు. పాఠశాల హెచ్ఎం కూర తయారీ గిన్నెను ఇచ్చాడు. సాంబారు తయారీ గిన్నెను తయారీదారులు కొనుగోలు చేసి వంట చేయడం ప్రారంభించారు. ఈ సంఘటనను బట్టి చూస్తే మిడ్డేమీల్స్ తయారీదారులకు కనీసం వంట పాత్రలు సైతం అందుబాటులో లేవన్న విషయం స్పష్టమవుతున్నది.
మల్యాల మండలంలోని మరో పాఠశాలలో మిడ్డే మీల్స్ తయారీకి సిద్ధం చేసిన పాత్రలు పూర్తిగా అల్యూమినీయం కోటింగ్ పోయి, పాచిపట్టాయి. అందులో అన్నం, కూర వండితే అది విషతుల్యంగా మారిపోవడం ఖాయమని ఎవరికైనా అర్థమవుతుంది. అయినా అందులోనే వండి వడ్డిస్తున్నారు. కాలం చెల్లిన అల్యూమినీయం పాత్రల్లో వంట శుభ్రమేనా..? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సైతం మధ్యాహ్నం భోజనం తయారీకి అల్యూమినియం గిన్నెలను వాడుతున్నారు. అయితే ఈ పాత్రలు సురక్షితమేనా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తుండగా, రసాయన శాస్త్ర నిపుణులు, ఫ్రొఫెసర్లు మాత్రం వంటకు అల్యూమినియం గిన్నెలు వాడడం ప్రమాదకరమని చెబుతున్నారు. సుదీర్ఘకాలం ఆ పాత్రలను వినియోగిస్తే రోగాల బారిన పడే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. ఈ గిన్నెలు వేడెక్కినప్పుడు అందులోంచి లెడ్ కరిగి ఆహారంలో కలుస్తుందని, ఇది భోజనం చేసే వారి ఉదరంలోకి వెళ్తుందని చెబుతున్నారు.
మనిషి శరీరంలోకి ప్రవేశించిన అల్యూమినియంలో 0.01 శాతం మాత్రమే కిడ్నీ వడగట్టగలదని, అంతకంటే ఎక్కువగా శరీరంలోకి చేరితే కిడ్నీ తన పనిని సరిగా నిర్వర్తించలేదని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఆ గిన్నెల్లో ఆమ్లాలకు సంబంధించిన కూరగాయలు వండినప్పుడు అవి విషతుల్యమయ్యే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నిమ్మ, చింత పులుపు లాంటివి ఆమ్ల లక్షణాలు ఉన్న పదార్థాలను వండినప్పుడు పెద్ద సమస్యలు వస్తాయంటున్నారు. విధి లేని పరిస్థితుల్లో వినియోగించినా, మూడు, నాలుగేండ్లకు మించి వాడొద్దని సూచిస్తున్నారు. అంతకు మించి వాడితే క్యాన్సర్, చిత్తభ్రాంతి, రక్తహీనత, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఎముకల శక్తిని తగ్గించే వ్యాధులు వచ్చే ప్రమాముందని చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారీ వంటపాత్రల కోసం ప్రభుత్వం నాలుగు నెలల కింద నిధులు మంజూరు చేసింది. జగిత్యాల జిల్లాలో దాదాపు 650 పాఠశాలలకు 85 లక్షలు వచ్చాయి. కానీ, ఇప్పటివరకు వంట పాత్రల కొనుగోలు, పంపిణీ మాత్రం పూర్తి కాలేదు. 50 సంఖ్యకు తక్కువగా ఉన్న పాఠశాలకు వంట పాత్రల కోసం 10వేలు, 51 నుంచి 100 మధ్య సంఖ్య ఉంటే 15వేలు, 101 నుంచి 250 మధ్య సంఖ్య ఉన్న వాటికి 20వేలు, 251 కంటే అధిక సంఖ్య ఉంటే 25వేలు మంజూరు చేసింది. ఈ నిధులతో వంటపాత్రలు కొని పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అన్నం, కూర తయారీ గిన్నెలు, దినుసులు పెట్టుకునేందుకు కంటైనర్, సాంబార్ బకెట్లు, సర్వీసింగ్ గిన్నెలు, చెంచాలు, కబ్గీర్లు కొనుగోలు చేయాలని సూచించారు. అన్నం, కూరగిన్నెలు అల్యూమినియంవి, మిగిలినవి స్టీల్ గిన్నెలు కొనాలని ఆదేశాలు ఇచ్చారు. నిధులు మంజూరు చేసి నెలలు గడుస్తున్నా, ఇంత వరకు పాఠశాలలకు పాత్రల పంపిణీ జరగలేదు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి అవే పాత్రలు భోజన తయారీకి వాడుతుండడం కనిపిస్తున్నది. మిడ్డే మీల్స్ తయారీదారులకు ప్రభుత్వమే వంట పాత్రలు ఉచితంగా సరఫరా చేసినట్టు, సిలిండర్ సౌకర్యం కల్పించినట్టు తెలుస్తున్నది. అయితే భోజన తయారీదారులు మాత్రం వంట పాత్రలను ప్రభుత్వం సరఫరా చేయలేదని, తామే స్వయంగా సమకూర్చుకున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతి ఐదు పదేండ్లకు ఒక్కసారి పాత్రలు సరఫరా చేసినట్టు చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయికి వంటపాత్రలు చేరినట్టు కనిపించడం లేదు. ఒకటి, రెండు ఏజెన్సీలకు సంబంధించిన వారు తమకు 20 ఏండ్ల క్రితం ఒకటి, రెండు గిన్నెలు ఇచ్చారని చెబుతున్నారే తప్ప 95 శాతం మంది తమకు వంటపాత్రల పంపిణీ జరగలేదనే లేదు. ఏండ్లుగా అవే గిన్నెలు వాడడం సైతం ప్రమాదాలకు కారణమని తెలుస్తున్నది.
వంటపాత్రలకు నిధులు మంజూరు కావడం, పంపిణీ కాకపోవడంపై విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ, కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్ నేతృత్వంలో వంట పాత్రల కొనుగోలు కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ నెల 7న టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే వంట పాత్రల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు.
పాఠశాలల్లో మిడ్డే మీల్స్ తయారీ గిన్నెలే కాదు, పిల్లలు తాగే నీరు సురక్షితమేనా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మిషన్ భగీరథ నీటి కనెక్షన్లను ఇచ్చింది. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో మళ్లీ పూర్వపద్ధతిలోనే బోర్లు, ట్యాంకర్ల నీటిని పిల్లలు వినియోగించే దుస్థితి ఏర్పడింది. బావులు, బోర్లలోని నీరు కావడం, క్లోరినేషన్ సరిగా జరగక అనేక ఇబ్బందులు వస్తున్నాయని చాలా మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా పాఠశాలల్లో రక్షిత మంచినీటి సౌకర్యం లేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. వంటపాత్రల శుభ్రత, సురక్షిత మంచినీటిని ప్రొవైడ్ చేస్తేనే ఇబ్బందులు తప్పుతాయని చెబుతున్నారు.