చౌడు నేలలో సేంద్రియ సేద్యం చేస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నాడు. అధునిక సాగు విధానాలను అవలంబించి బంగారు పంటలు పండిస్తున్నాడు. తాను పండించిన చిరుధాన్యాలను ఇతర రాష్ర్టాలకు సైతం ఎగుమతిచేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు గొల్లపల్లికి చెందిన వంగల నర్సింహారెడ్డి. ఈ క్రమంలో ఆయన కృషిని గుర్తించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేసిన నేపథ్యంలో ఆయన విజయ ప్రస్థానంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన వంగల నర్సింహారెడ్డికి గ్రామ శివారులో సేద్యానికి పనికిరాని రెండున్నరెకరాల చౌడుభూమి ఉన్నది. వ్యవసాయంపై మక్కువతో నేలలో సిరులు పండించే లక్ష్యంతో సాగును మొదలుపెట్టాడు. తన భూమి పక్కన గల సుమారు 30 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దశాబ్దం క్రితం నుంచి సాగు చేస్తున్నాడు. ఏటా పంటమార్పిడి చేస్తూ అధునాతన పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ లాభాల బాటలో ముందుకుసాగుతున్నాడు.
ఆర్గానిక్ పద్ధతిలో చిరు ధాన్యాలు..
నర్సింహారెడ్డి ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో కొర్రలు, రాగులు, సామలు, ఊదలు, నువ్వులు, జొన్నలు పండిస్తున్నాడు. వీటికి డిమాండ్ అధికంగా ఉన్న గుంటూరుకు ఎగుమతి చేస్తున్నాడు. కొంత కాలం జొన్నలు ఇంటింటా తిరిగి అమ్మితే కొనేందుకు ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు ఇంటికి వచ్చి కొనుగోలు చేస్తున్నారని నర్సింహారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
కూలీల కొరతను అధిగమించేందుకు..
సేంద్రియ సేద్యానికి కూలీల అవసరం ఎక్కువగా ఉంటున్నది. అయితే కూలీల కొరతను అధిగమించేందుకు వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటవిధానంలో మార్పులు చేస్తున్నాడు. ఎనిమిదేండ్లు డ్రమ్సీడర్ పద్ధతిలో వరి వేశాడు. రెండేండ్ల నుంచి వెదజల్లే విధానంలో సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం డ్రైసీడింగ్ యంత్రం ద్వారా విత్తనాలు వేస్తున్నాడు.
నాడు జిల్లా ఉత్తమ రైతు పురస్కారం
చిరుధాన్యాలను పండిస్తూ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు, బెంగళూరుకు ఎగుమతి చేస్తున్నాడు. వ్యవసాయంలో కొత్త విధానాలను అనుసరిస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచిన నర్సింహారెడ్డి 2019, 2022లో జిల్లా ఉత్తమ రైతు పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంలో తాను అనుసరిస్తున్న సేద్యపు పద్ధతులను అనుసరిస్తున్న ఆయనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆదివారం(సెప్టెంబర్, 3) రాష్ట్రస్థాయి ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు.
వ్యవసాయమంటే మక్కువ..
నాకు మా ఊరి శివారులో రెండున్నరెకరాల భూమి ఉన్నది. అదిగూడా చౌడు నేల. సాగుపై ఉన్న మక్కువతో ఎనిమిది సంవత్సరాలు డ్రమ్సీడింగ్, ఓ రెండేండ్లు వెదజల్లే పద్ధతిలో వరి వేసిన. ఇప్పుడు డ్రైసీడింగ్ యంత్రంకూడా వచ్చింది . దీంతో సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు కూలీల కొరత సమస్యను అధిగమించే అవకాశం ఉన్నది. ఒక వరుస క్రమంలో డ్రైసీడింగ్ జరిపితే మందులు, ఎరువులు వేసేందుకు సులువవుతుంది, పిలక కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటది. దీంతో మక్కజొన్న, వరిని నా భార్య లక్ష్మితో కలిసి సాగు చేస్తున్న.. ఏటా పంటమార్పిడి చేస్తూ మక్కజొన్న, సామలు, రాగులు, సజ్జలు, కొర్రలు, ఊదలు పండిస్తున్న.
-వంగల నర్సింహారెడ్డి, రైతు, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట.
నర్సింహారెడ్డి నిత్య విద్యార్థి..
‘నర్సింహారెడ్డి రైతుగా కొత్త విధానాలు నేర్చుకోవడానికి ఎప్పటికప్పుడు మా అధికారులను, నన్ను సంప్రదిస్తాడు. పంటమార్పిడి, నూతన యంత్రాల వాడకం, ఆర్గానిక్ ఫామింగ్ వంటి విశయాల్లో నిత్య విద్యార్థిలాగా అడిగి తెలుసుకుని ఆచరణలో పెడుతాడు. సౌడు నేలలో కూడా చిరుధాన్యాలు, ఆరుతడి పంటలు వేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రైతులకు ఆదర్శంగా నిలిచేలా పంటలు పండిస్తున్న నర్సింహారెడ్డికి రాష్ట్రస్థాయి పురస్కారం దక్కడం సంతోషకరం..
– చాడ భూంరెడ్డి, మండల వ్యవసాయాధికారి, ఎల్లారెడ్డిపేట