కలెక్టరేట్, మార్చి 21 : పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమంపై సెగ్మెంట్లోని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశమందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కొత్త ఓటరు కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని, 18 ఏళ్లు నిండిన వెంటనే విధిగా ఓటరు నమోదు చేసుకోవాలన్నారు.
కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు, తప్పుల సవరణ కోసం, డబుల్ ఓటరు నమోదు సవరణకు, స్థల మార్పిడి చేసుకునే వారు, చనిపోయిన వారి ఓటు తొలగించేందుకు సంబంధించి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8లు ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, పలు పార్టీల నాయకులు సత్తినేని శ్రీనివాస్, సిరాజ్ హుస్సేన్, నాంపల్లి శ్రీనివాస్, మిలుకురి వాసుదేవరెడ్డి, కళ్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.