Operation Kalyan Nagar | కోల్ సిటీ, మే 22: రామగుండం నగర పాలక సంస్థ అధికారులు మళ్లీ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టారు. గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ లో రోడ్ల వెడల్పుకు అడ్డుగా ఉందన్న కారణంగా గురువారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో వ్యాపారులు చూస్తుండగానే భవనంను నేలమట్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అనుబంధ రామగుండం నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికుల సంఘం అధ్యక్షుడు నడిపెల్లి మురళీధర్ రావుకు చెందిన భవనంకు ఇటీవల మార్కింగ్ ఇచ్చారు. అయితే తానే స్వచ్ఛందంగా తొలగిస్తానని జూన్ 1 వరకు గడువు ఇవ్వాలంటూ నగర పాలక టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తు ఇచ్చిన క్రమంలోనే గురువారం నగర పాలక అధికారులు అత్యుత్సాహంతో ఆ భవనంను కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. కళ్యాణానగర్ ప్రాంతంలో గతంలోనే రోడ్ల వెడల్పులో భాగంగా వివిధ భవనాలు కూల్చివేశారు.
అదే కళ్యాణ్‌నగర్ సెంటర్లో మూలలోనే ఉన్న మిగతా దుకాణాల జోలికి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడికి సంబంధించిన భవనంను కూల్చివేయడం గమనార్హం. అంతేగాకుండా కళ్యాణ్ నగర్ సెంటర్ నుంచి మేదరిబస్తీ లో గల శ్రీ వెంకటేశ్వర సైకిల్ షోరూం నుంచి సింగరేణి క్వార్టర్ల మీదుగా ప్రధాన చౌరస్తా రహదారి అనుకుని ఉన్న టాక్సీ అడ్డా వరకు మరో రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రచారం జరగడంతో ఆటు సింగరేణి క్వార్టర్లలో ఉంటున్న వారితోపాటు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉండగా నగరంలో ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు జరుగుతాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. కాగా, మరో రెండు మూడు రోజుల్లో మళ్లీ లక్ష్మీ నగర్ లో రోడ్ల వెడల్పు లో భాగంగా భవనాలు తొలగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం.