పెద్దపల్లి టౌన్, జూన్ 6: కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి.. మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ తీశారు. అనంతరం అఖిలపక్షం నాయకులు మాదన కుమారస్వామి, ఈదునూరి నరేశ్, ఎరవెల్లి ముత్యంరావు, తాండ్ర సదానందం మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దండకారణ్యంలోని లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను బడా కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆదివాసీలను అక్కడి నుంచి గెంటివేసేందుకే కుయుక్తులు చేస్తున్నదని మండిపడ్డారు.
వందలాది మంది మావోయిస్టులు ఆదివాసీలను బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేస్తున్నదని ఆవేదన చెందారు. మావోయిస్టులు ఉన్నారనే ఎర చూపి ఖనిజ సంపదను కొందరికి కట్టబెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. శత్రు దేశమైన పాకిస్తాన్‌తో చర్యలు జరిపి కాల్పుల విరమణ చేసిన బీజేపీ ప్రభుత్వానికి.. దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరుపడానికి వచ్చిన ఆటంకాలు ఏంటని ప్రశ్నించారు. కర్రెగుట్ట బూటకపు ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దేశంలో రానున్న రోజుల్లో బీజేపీకి పుట్టగతులు ఉండవని జోస్యం చెప్పారు. నిరసన ర్యాలీలో అఖిలపక్షం, వామపక్ష నాయకులు ఈర్ల నరేశ్, మాదన కుమారస్వామి, ఎరవెల్లి ముత్యంరావు, తాండ్ర సదానందం, కల్లెపల్లి అశోక్, గడ్డం జ్యోతి, జిల్లెల ప్రశాంత్, కన్నెబోయిన కనకరాజు, గాండ్ల మల్లేశం, మోదుంపల్లి శ్రావణ్, బాలసాని రాజయ్య, లెనిన్, తాళ్లపల్లి మల్లయ్య, సుచరిత, క్యాదాసి లింగమూర్తి, కోల్లూరి మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.