సుల్తానాబాద్‌రూరల్, జూన్ 21: తమ గ్రామంలో మూతపడిన సర్కారు బడిని తిరిగి తెరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పిల్లల చదువులకు ఇబ్బందులు అవుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను ప్రారంభించాలని వారు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నది. దాదాపుగా పదేండ్ల క్రితం వివిధ కారణాలతో సర్కారు బడి మూతపడింది. దీంతో అప్పటి నుంచి గ్రామంలో దాదాపుగా 40మంది విద్యార్థులు సుల్తానాబాద్‌తో పాటు తదితర గ్రామాలకు వెళ్లి ప్రైవేట్ పాఠశాలలో విద్యనభసిస్తున్నారు.
మంచరామి గ్రామంలో 1,386మంది జనాభా ఉండగా, 494కుటుంబాలు ఉన్నాయి. రికార్డుల ప్రకారం 391గృహాలు ఉన్నాయి. గ్రామం నుంచి ప్రభుత్వ ఉదోగ్యాలు (ప్రస్తుతం జిల్లా డీపీవో వీరబుచ్చయ్యతోపాటు ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, కానిస్టేబుల్‌తోపాటు పలువురు) పొందిన వారు సైతం తిరిగి పాఠశాలను తెరిపించాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
పీజీ పరీక్షల ప్రణాళిక విడుదల
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూన్ 21 : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఏ, ఎంఎస్సీ, ఎం.కామ్ పరీక్షల ప్రణాళికను యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేశ్‌కుమార్ శనివారం విడుదల చేశారు. ఈ క్రమంలో నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కూడా జూలై 1 నుంచి 16, ఎంసీఏ పరీక్షలు జూలై 1 నుంచి 6వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని, సందేహాలకు ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.