Collector B Satya Prasad | పెగడపల్లి : ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ తెలిపారు. పెగడపల్లి మండలం కేంద్రంలోని ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరా పై యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో పరిశీలించారు.
రైతులు వేసిన పంటకు అవసరమైన యూరియాను మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లయితే సొసైటీ, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పని అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధుసూధన్, జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్, తహశీల్దార్ రవీందర్, ఎంపిఓ శ్రీకాంత్, పాక్స్ కార్యదర్శి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.