జగిత్యాల జిల్లాను క్రిప్టో కరెన్సీ కుదిపేస్తున్నది. ఏడాదిన్నరలో ఒక ఊపు ఊపిన క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ చైన్‌లింక్ దందా, మెల్లగా తన అసలు రంగును బయటపెడుతున్నది. అత్యధిక కమీషన్ వస్తుందనే దురాశతో ఏజెంట్లు నమ్మించి పెట్టుబడులు పెట్టించగా.. ప్రభుత్వోద్యోగులు, సామాన్యులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ మాయలో పడి నిండా మునిగినట్టు తెలుస్తున్నది. దాదాపు రెండేండ్ల వ్యవధిలో ఏకంగా 1400 కోట్ల నుంచి 1600 కోట్ల మధ్య పెట్టబడులు పెట్టినట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుండగా, ఇప్పుడు ఆన్లైన్లో యాప్‌లు కనమరుగవుతుండడం వేలాది మందిని ఆందోళనకు గురిచేస్తున్నది.
జగిత్యాల, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : క్రిప్టో కరెన్సీ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు గానీ, బిట్‌కాయిన్ అంటే మాత్రం అందరికీ తెలిసిపోయింది. వాస్తవానికి క్రిప్టో కరెన్సీ అంటే నగదురహిత ద్రవ్యంగా చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో యూరప్‌తోపాటు అమెరికా వంటి ఖండాల్లో క్రిప్టో కరెన్సీని రూపొందించారు. పెట్టుబడులు, డబ్బు విడిపించుకోవడం ఇలా అన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. ఇది కేవలం వ్యక్తిగతం. అయితే దీనిని అభివృద్ధి చెందిన దేశాలు అనుమతించాయి. క్రిప్టో కరెన్సీ పద్ధతిలో బిట్‌కాయిన్‌తోపాటు వజీర్ ఎక్స్, యూనోకైన్, కైన్డీసీఎక్స్, కాయిన్ స్విచ్, ఎథీరియం ఇలా 20కి పైగా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. మనదేశంలో మాత్రం క్రిప్టోకు అనుమతి లేదు. కానీ, భారత ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో మాత్రం ఒక ప్రకటన చేశారు. ‘క్రిప్టో కరెన్సీని కొనాలనుకుంటే కొనచ్చు. కానీ, ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వదు. ఈ డాలర్లలోనే నిర్వహించుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పారు. అయితే డాలర్లను రూపాయిలోకి మార్చుకునే సందర్భంలో మాత్రం నిర్దేశిత ట్యాక్స్ చెల్లించాలని స్పష్టం చేశారు.
క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ నిషేధం లేకపోవడం, వ్యక్తిగతంగా నిర్వహించుకునే అవకాశం ఉడడంతో పలువురు బ్రోకర్లు జగిత్యాల జిల్లాలో క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ దందాలకు తెరలేపారు. భారత రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా క్రిప్టో కరెన్సీ పేరిట బ్లాక్ చైన్ వ్యాపారాన్ని సైతం ప్రారంభించారు. పేరు లేని అనామకమైన కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకరాగా, ఆన్లైన్ యాప్‌లతో వ్యాపారం మొదలు పెట్టారు. పెట్టుబడి మొత్తం ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుందని, డాలర్ల రూపంలో లెక్క ఉంటుందని, రోజూ డబ్బు జమవుతుందని, ట్యాక్స్ కట్టి అవి తీసుకునే అవకాశం ఉందని నమ్మించారు. లక్ష పెట్టుబడి పెడితే నెలకు 16 వేల చొప్పున ఏడాది పాటు డబ్బులు వస్తాయని ఆశ పెట్టారు. ఈ లెక్క ప్రకారం 12 నెలల కాలంలోనే దాదాపు రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మి, చాలా మంది పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఇది ఒకరి నుంచి ఒకరికి పాకడం ఆరంభమై, పలువురు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. కొందరు ఐదు నుంచి ఆరు శాతం వడ్డీకి తెచ్చి లక్షల్లో పెడితే.. మరికొందరు ఉన్న బంగారు ఆభరణాలు, భూములు, ఇండ్లను విక్రయించి, కుదవపెట్టి మరీ డబ్బులు పెట్టారు. ఒకానొక దశలో భార్య మెడలో ఉన్న పుస్తెలతాడును సైతం తాకట్టు పెట్టినవారు ఉన్నారని చెబుతున్నారు. రెండేండ్ల క్రితం చినుకులా మొదలైన ఈ వ్యాపారం చూస్తుండగానే జడివానలా మారింది. ఏకంగా 1400 కోట్ల నుంచి 1600 కోట్ల మధ్య పెట్టబడులు పెట్టినట్టు ఆర్థిక నిపుణుల ద్వారా తెలుస్తున్నది. ఈ దెబ్బకు కొన్నాళ్లపాటు ఇతర ప్రధాన వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ నుంచి మొదలుకొని వడ్డీ, బంగారం వ్యాపారం, ఫైనాన్స్ వ్యవస్థలు సైతం కుదేలయ్యాయంటున్నారు.
వీఎంటీ, రెక్సోర్స్, మెటాఫండ్ లాంటి కంపెనీలు ఏజెంట్లను నియమించుకొని, చైన్సిస్టం వ్యాపారాన్ని మొదలు పెట్టాయి. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టిన వ్యక్తి, మరొకరిని వ్యాపారంలో చేర్పిస్తే 50 శాతం కమీషన్ వస్తుందని ఆశ చూపాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టించిన వారి సంఖ్యను బట్టి, చైన్ సిస్టం నిర్వహిస్తున్న వారికి స్టార్లను కేటాయించడం మొదలు పెట్టారు. టూ స్టార్, త్రీ స్టార్, ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్, సిక్స్ స్టార్, సెవెన్ స్టార్ అంటూ కేటగిరీలను ఏర్పాటు చేశారు. స్టార్ హోదా వచ్చిన వారికి అదనపు వేతనాన్ని, పారితోషికాలను, వాహనాలను గిఫ్ట్‌లుగా ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో క్రిప్టో పేరిట తప్పుడు యాప్‌లకు ఏజెంట్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చారు. ఒక్కో ఊరిలో పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా గ్రామంలో కీలకంగా వ్యవహరించే రేషన్ డీలర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, చోటామోటా పొలిటీషియన్లు యాప్‌లలో పెట్టుబడులు పెట్టించారు. రాయికల్ మండలంలోని ఒక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ముగ్గురు ఏజెంట్లు కనీసం వంద కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తున్నది. అలాగే, జగిత్యాల అర్బన్ మండలంలోని ఒక ఊరిలో ఓ ఏజెంట్ సెవెన్ స్టార్ స్థాయికి చేరుకొని, గ్రామంలో వందలాది మందిని వ్యాపారంలో భాగస్వామ్యం చేసినట్టు సమాచారం. సదరు వ్యక్తి రోజుకు 5 లక్షలకుపైగా వేతనం పొందినట్టు తెలిసింది. దీనికి తోడు సదరు సెవెన్ స్టార్‌కు కంపెనీ నిర్వాహకులు హైదరాబాద్‌లో విల్లాతోపాటు లక్షల విలువైన కారును బహుమానంగా ఇచ్చినట్టు సమాచారం. జిల్లాలో ఇద్దరు సెవెన్ స్టార్లు, పదుల సంఖ్యలో ఫైవ్ స్టార్ రేటింగ్ చేసిన ఏజెంట్లు, వందల సంఖ్యలో ఇతర స్టార్ ర్యాంకింగ్‌కు చేరిన ఏజెంట్లు ఉన్నట్టు తెలిసింది.
బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీని బాగా ప్రమోట్ చేసి, కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టించడంలో బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారే కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. నిర్మల్ జిల్లాలో రెండు నెలల క్రితం కేసులు నమోదైన సందర్భంలో టీచర్లు ప్రధాన పాత్ర పోషించినట్టు గుర్తించిన విషయం విధితమే. జగిత్యాల జిల్లాలో సైతం ముఖ్యంగా ప్రభుత్వోపాధ్యాయులే క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ సిస్టంను బాగా పెంచినట్టు సమాచారం. పదుల సంఖ్యలో టీచర్లు వేలాది మందితో పెట్టుబడులు పెట్టించినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా సంఘ నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు తమ పరపతిని వాడి పెద్ద సంఖ్యలో చేర్పించినట్టు సమాచారం. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు సైతం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు చైన్లను వృద్ధి చేసినట్టు తెలిసింది. జిల్లాలో గతంలో పనిచేసి, తర్వాత పనిష్మెంట్పై వెళ్లిన ఓ పోలీస్ అధికారి కోట్లలో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. అలాగే, నలుగురైదుగురు ఎస్ఐలు సైతం భారీగానే పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తున్నది. దాదాపు జిల్లాలో 50 నుంచి 60 మంది కానిస్టేబుళ్లు క్రిప్టో మాయలో పడినట్టు సమాచారం.
రాజకీయ నాయకులు సైతం క్రిప్టో కరెన్సీ మాయలో పడిపోయారు. చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు లబోదిబోమంటున్నారు. ఒక ప్రముఖ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడి సోదరుడు దాదాపు ఐదు కోట్ల పెట్టుబడులు స్వయంగా పెట్టడంతోపాటు దాదాపు 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు పెట్టుబడిగా పెట్టించినట్టు తెలిసింది. అలాగే, మరో ద్వితీయ శ్రేణి నాయకుడు 18 లక్షలు పెట్టినట్టు సమాచారం. ఇలా వందల సంఖ్యల్లో నాయకులు పెట్టుబడులు పెట్టడంతోపాటు తమకు ఉన్న పరపతిని వినియోగించి, పెట్టుబడులు పెట్టించినట్టు తెలుస్తున్నది. యాప్‌లలో పెట్టుబడి పెట్టిన కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతూ, దసరా పండుగను సైతం తాము చేసుకోలేని పరిస్థితికి దిగజారిపోయామని ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం.
యాప్‌లో పెట్టుబడి పెట్టినవారితో పాటు పెట్టుబడి పెట్టించిన బ్రోకర్లు పెద్ద మొత్తంలో షోకులు చేయడం కొన్నాళ్లుగా నిత్యకృత్యం అయిపోయింది. పెట్టుబడి పెట్టి, బ్లాక్ చైన్ సిస్టంలో భాగస్వామ్యం అయిన పలువురిని కంపెనీ ప్రతినిధులు విదేశాలకు తీసుకెళ్లడం బహిరంగ రహస్యంగా మారిపోయింది. పలువురు టీచర్లు, ఉద్యోగులు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దుబాయి వంటి దేశాలకు విహారయాత్రలకు తీసుకువెళ్లడం మొదలుబెట్టారు. కొన్నాళ్ల క్రితం వరకు జిల్లాలో పనిచేసి ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు సైతం సింగపూర్, మలేషియా, దుబాయ్ పర్యటనలకు వెళ్లి మజా చేసి వచ్చినట్టు సమాచారం.
పెట్టబడులు పెట్టిన వారిలో దాదాపు అన్ని వర్గాల వారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సామాన్యులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో యాప్‌లు కనుమరుగు కావడంతో వీరంతా లబోదిబోమంటున్నారు. ఏడాదిలోపే రెట్టింపు డబ్బులు వస్తున్నాయన్న ఆశతో లక్షల్లో పెట్టుబడులు నిండా మునిగామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు బాధితులంతా సంఘాలుగా ఏర్పడి పోరాటం చేయాలన్న ఆలోచనలు చేస్తున్నారు. ఈ దందా విషయమై పోలీస్ అధికారులు మాట్లాడుతూ, క్రిప్టో కరెన్సీ యాప్‌లకు ప్రభుత్వ అనుమతి లేదని ముందు నుంచీ చెబుతున్నామని, ఇప్పుడు అందరూ తమకు న్యాయం చేయాలని కోరుతుండడం చూస్తే బాధాకరంగా ఉందన్నారు. ఫిర్యాదులు వస్తే కేసులు చేసి దర్యాప్తు జరుపుతామని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశామని, ఇంకా పలు కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు.
మొదట్లో సక్రమంగానే కనిపించిన క్రిప్టో కరెన్సీ యాప్‌ల వ్యవహారం, కొన్నాళ్లుగా ఇబ్బందికరంగా మారుతూ వచ్చింది. వేలాది కోట్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత రోజువారీగా డాలర్ల రూపంలో యాప్‌లో కనిపించాల్సిన లెక్కలు కనిపించకుండా పోవడం ఆరంభమైంది. చూస్తుండగానే యాప్‌లు ఆన్లైన్లో కనిపించకుండా పోవడం మొదలైంది. దీంతో పెట్టుబడి పెట్టిన వారంతా నిండా మునిగిపోయినట్టు గుర్తించడం మొదలు పెట్టారు. చైన్ సిస్టంలో భాగంగా తమను చేర్పించిన స్టార్ల వద్దకు, స్టార్లు తమపై ఉన్న స్టార్ల వద్దకు పరుగులు తీయడం ప్రారంభించారు. అయితే, ఆన్లైన్ వ్యాపారం కావడం, యాప్‌లను ఎవరు నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియకపోవడంతో ఇన్నాళ్లూ వ్యాపారం చేసిన వారు బిక్కమొకం వేసుకొని చూస్తున్నారు. యాప్‌ల గురించి ఎవరిని ప్రశ్నించాలో సైతం తెలియని పరిస్థితిలో పడిపోయారు. పెట్టుబడి పెట్టిన సమయంలో యాప్ కోసం ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో తమపై పేర్లపై ఉన్న పేర్లను ఆధారంగా చేసుకొని వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చాలా మట్టుకు ఇతర రాష్ర్టాలకు చెందిన వారు, ఇతర దేశాలకు చెందిన వారే ఉండడంతో వారిని కలుసుకొని, ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చాలా మంది బ్రోకర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, పెట్టుబడి పెట్టిన వారు పోలీస్ స్టేషన్లకు వెళ్లడం మొదలు పెట్టారు.