Foreign Gold | వేములవాడ, మార్చి 29 : సినిమా తరహాలో విమానాశ్రయంలో దిగి దిగగానే బంగారాన్ని అపహరించిన తీరు పై కేసు నమోదు చేసి ఏడాది పూర్తైంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో గత ఏడాది మార్చి మాసంలో 40 తులాల బంగారాన్ని అపహరించినట్లుగా పోలీస్ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన నిందితుడు ఏనుగుల నాగరాజు కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఏడాది అవుతున్న కేసులో పురోగతి లేకపోగా నిందితుడు ఇంతకాలం విదేశాల్లో ఎలా ఉన్నారనే ప్రశ్నలు ప్రస్తుతం అంతుచిక్కకుండా ఉన్నాయి.
అసలు జరిగింది ఇలా…
జగిత్యాల జిల్లా మల్లాపూర్ కు చెందిన రాంప్రసాద్ బావ రవీందర్ సౌదీలో ఉద్యోగరీత్యా పని చేస్తున్నాడు. అయితే అక్కడ బంగారం తక్కువ ధరకు దొరుకుతుందని రాంప్రసాద్ శుభకార్యం నిమిత్తం బంగారం అవసరం ఉందని అతనికి పంపాలని కోరగా వేములవాడ ప్రాంతానికి చెందిన కాలువ వెంకటేష్ మధ్యవర్తిత్వంతో, చందుర్తి మండలానికి చెందిన బీరయ్య, గడ్డం అనీల్ బంగారంతో గత ఏడాది మార్చి 26న ఇండియాకు వచ్చారు. అయితే మీరు ఇండియాకు వస్తున్న సమయంలోనే బీరయ్య బంధువు ఏనుగుల నాగరాజుతో తాము విలువైన బంగారాన్ని తీసుకు వస్తున్నామని ముందస్తుగా వెల్లడించడంతో అతను బంగారం అపహరించేందుకు పన్నాగం పన్నినట్లుగా అప్పటి పోలీసులు వెల్లడించారు. ఇక 40 తులాల బంగారాన్ని బీరయ్య, అనిల్ నాగరాజుతో కలిసి ఇండియాకు తెచ్చి అపహరించారని అప్పటి పోలీసులే వెల్లడించారు. బంగారం అపహరణ కేసులో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. కొందరు నిందితులను పోలీసులు రిమాండ్ కూడా చేశారు. ప్రధాన నిందితులు ఏనుగుల నాగరాజు, వెంకటేష్ మాత్రం ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు.
అధికారుల కండ్లు కప్పి స్వదేశంలోకి విదేశీ బంగారం..?
విమానాశ్రయంలో తనిఖీ అధికారుల కన్ను కప్పి పెద్ద ఎత్తున బంగారాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే అసలు సౌదీ నుండి కిలోకి పైగా బంగారాన్ని ఇండియాకు తీసుకువచ్చారనే పుకార్లు షికారు చేశాయి. పోలీసులే స్వయంగా 40 తులాల బంగారం ఇండియాకు తెచ్చారని వెల్లడించిన తీరే ఇందుకు నిదర్శనం. ఇందులో లోతైన కోణాన్ని మరిచిన పోలీసులు కేసులో కూడా ఏడాది గడుస్తున్న పురోగతి లేకపోవడం విడ్డూరంగా ఉంది.
లుక్ అవుట్ నోటీసులతో సరి..!
ఇండియాకు వచ్చిన బంగారాన్ని చాకచక్యంగా వారి నుండి తప్పించి పరారైన ప్రధాన నిందితులు నాగరాజు, వెంకటేశులను పట్టుకోవడం కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే నాగరాజు అదే సమయంలో దుబాయ్ కి పారిపోయినట్లుగా పోలీసులు నిర్ధారించుకొని లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల్లో ఉన్నవారిని పట్టుకునేందుకు పోలీస్ శాఖ ఈ విధమైన ప్రయత్నం చేస్తోంది. అయితే చందుర్తి మండలం లోని హత్య కేసులో ప్రధాన నిందితుడు హత్య చేసి దుబాయ్ పారిపోయాడు.
సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయడమే కాకుండా ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులకు పట్టుదలతో ప్రయత్నించి అక్కడి కంపెనీలతో సంప్రదింపులు జరిపి స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేశారు. హత్యలో కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి వ్యక్తి ఏలాగైనా తప్పించుకోవాలని గుజరాత్ విమానాశ్రయంలో దిగగా అతనిని అక్కడి విమానాశ్రయ అధికారులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించగా, జైలుకు పంపిన విషయం తెలిసిందే. మండలంలో పనిచేసిన మరో అధికారి కూడా ఇదే తరహాలో తప్పించుకొని విదేశాలకు పారిపోతే సదరు వ్యక్తిని కూడా పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసి స్వదేశానికి రప్పించి మరి కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అనేక కేసులు పరిష్కారమైన ఈ కేసు విషయంలో పోలీసు శాఖ కేవలం లుక్ అవుట్ నోటీసులకే సరిపెట్టడం అంతు చిక్కని ప్రశ్నగా మారింది.