Godavarikhani | కోల్ సిటీ, జూలై 17 : వలస పక్షుల గూడు చెదిరింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 యేళ్ల నాటి భారీ చింత చెట్టు నేలమట్టమైంది. ఈ సంఘటన గోదావరిఖని నగరంలోని అడ్డగుంటపల్లి ప్రాంతంలో గల త్రివేణి కాంప్లెక్స్ ఎదుట చోటు చేసుకుంది. రోడ్డు వెడల్పు పేరుతో రామగుండం నగర పాలక సంస్థ అధికారులు బుధవారం రాత్రి జన సంచారం తగ్గడం చూసి ఆ చింత చెట్టును కూల్చివేశారు.
ఐతే అదే చెట్టు చాలా ఏళ్లుగా సుమారు 200 కొంగలు, ఇతర వలస పక్షులకు ఆవాసంగా ఉండేది. తమ గూడు చెదిరిపోవడంతో ఆ వలస పక్షులు ఆ రాత్రి పూట మరో చెట్టుపైకి వెళ్లలేక చీకట్లోనే మగ్గుతూ నేలమట్టమైన అదే చెట్టుపైనే బిక్కుబిక్కుమంటూ గడిపాయి. అప్పటికే కొందరు పక్షుల వేటగాళ్లు అటుగా వచ్చి సుమారు 30 కొంగల వరకు రెండు సంచుల్లో నింపుకొని వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మిగతా కొంగలను వీధి కుక్కలు ఎక్కడ చంపుతాయో అంటూ ఆ రాత్రంతా స్థానికులు కాపలాగా ఉన్నారు.
అర్ధరాత్రి దాటాక కంటి నిద్రను ఆపుకోలేక జనం ఎవరి ఇళ్లలోకి వారు వెళ్లిపోయారు. తెల్లవారు చూసేసరికి చాలా కొంగలు చనిపోయి ఉన్నాయి. సంఘటన విషయం తెలియగానే పర్యావరణ ప్రేమికులు అక్కడకు చేరుకొని నగర పాలక అధికారుల చర్యలను వ్యతిరేకించారు. అయ్యో పాపం… ఆ వలస పక్షులు ఏం పాపం చేశాయని ఈ శిక్ష అంటూ ఆవేదన చెందారు. యేళ్ల తరబడి తమకు బతుకునిచ్చిన చెట్టును వీడలేక… ఆ రాత్రంతా మరో చెట్టుపైకి వెళ్లడానికి దారి కనిపించక అక్కడే ఉన్న మిగతా పక్షులకు వెటర్నరీ సిబ్బంది వచ్చి వైద్య పరీక్షలు చేసి కరీంనగర్ లోని పక్షుల సంరక్షణ కేంద్రంకు తరలించినట్లు తెలిసింది. కాగా, హృదయ విదారకరమైన ఈ సంఘటన పక్షి ప్రేమికులను కలిచివేసింది.