GANGADHARA | గంగాధర, మార్చి 31: తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, లక్నో తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని బత్ ఖండే సంస్కృతి విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో నిర్వహించిన ఉగాది వేడుకలలో భాగంగా గంగాధర మండలం తాడిజెర్రి గ్రామ మల్లిఖార్జున ఒగ్గుకళా సేవా సమితి కళాకారులు ఒగ్గు కళలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన, ఐఏఎస్లు కే రవీందర్ నాయక్, గురు, లక్నో తెలుగు అసోసియేషన్ సంస్థ అధ్యక్షులు డీఎన్ రెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న గ్రామీణ మట్టి కళారూపాల్లో ఒకటైన ఒగ్గు కథకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కళాకారులు చేస్తున్న కృషిని నిర్వాహకులు అభినందించారు. తెలంగాణ రాష్ట్ర కళారూపమైన ఒగ్గుకళను జాతీయస్థాయికి తీసుకువెళ్లిన తాడి జెర్రి మల్లికార్జున ఒగ్గుకళా సేవా సమితి సభ్యులను ఈ సందర్భంగా నిర్వాహకులు అభినందించారు.
అనంతరం కళాకారులకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందించి సన్మానించారు. ఉగాది ఉత్సవాల్లో ఒగ్గుకళను ప్రదర్శించడానికి అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ కు సేవాసమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఈర్ల మహిపాల్, గుంట మహేందర్, ఈర్ల గణేష్, గడ్డం రాము, మేకల ప్రశాంత్, నాగం మొగ్గయ్య, పోలె అనిల్, పోలె శ్రీకాంత్, బండారి విజయ్, పోలె శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.