Karimnagar | గంగాధర, నవంబర్ 10 : ఒకే సర్వే నంబర్, ఒకే అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి, తనకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయకుండా సబ్ రిజిస్టర్ నిరాకరించాడని కరీంనగర్ పట్టణానికి చెందిన తోట శ్రీకాంత్ సోమవారం గంగాధర సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఇన్చార్జి సబ్ రిజిస్టార్ సదాశివరామకృష్ణతో వాగ్వాదానికి దిగాడు.
బాధితుడు శ్రీకాంత్ కథనం ప్రకారం.. కరీంనగర్ పట్టణానికి చెందిన తోట శ్రీకాంత్ రేకుర్తి రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నంబర్ 80లోని లేపాక్షి అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 304ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన సేల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి గత నెల 18న గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంటును సమర్పించారు.
డీటీసీపీ నిబంధనలు, చింతకుంట గ్రామపంచాయతీకి సంబంధించి జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను చూపుతూ ఇన్చార్జి సబ్ రిజిస్టర్ సదాశివరామకృష్ణ డాక్యుమెంటును నిరాకరించాడు. అయితే ఇదే సర్వే నంబర్లు, ఇదే లేపాక్షి అపార్ట్మెంట్ కు సంబంధించిన ఇదే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మరొకరికి మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపాడు.
నిజానికి రేకుర్తి సర్వే నంబర్ 80 లోని లేపాక్షి అపార్ట్మెంట్ కు సంబంధించి ఎలాంటి నిషేధిత ఉత్తర్వులు లేకున్నా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సర్వే నంబర్లు మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ అంగీకరించి, అగ్రిమెంట్ చేయకుండా నిరాకరించడం అన్యాయం అన్నారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదాహరిస్తూ చట్టపరమైన నిషేధిత ఉత్తర్వులు లేకున్నా రిజిస్ట్రేషన్ ను నిరాకరించడం రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 71,72 లకు వ్యతిరేకమని ఆయన తెలిపారు. దీనిపై జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అప్పిలు చేస్తామని తెలిపాడు.