
ICDS | తిమ్మాపూర్, జనవరి 24: తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన ఊబిది రేఖ అనే గర్భిణి మహిళా ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు అలాగే డెలివరీ కోసం ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకుని.. ఆధార్ లేదు.. అమ్మను కాలేనా.. అని ‘నమస్తే తెలంగాణ’ వెబ్న్యూస్ లో ఈనెల 22న వార్త ప్రచరితమైంది.
దీంతో సీఎంఓ ఆఫీస్ నుండి జిల్లా అధికారులకు ఆదేశాలు రావడంతో హుటాహుటిన అధికారుల బృందం రేఖ ఇంటికి క్యూ కట్టారు. ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ అయ్యేంతవరకు వైద్య పరీక్షలు చేయిస్తామని, డెలివరీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెకు ఆధార్ కార్డు కూడా వచ్చేలా చూస్తామని అధికారుల బృందం ‘నమస్తేతెలంగాణ’కు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్, సీడీపీఓ శ్రీలత, సఖి సెంటర్ అడ్మిన్ లక్ష్మి తదితరుల అధికారులు శనివారం ఆమె ఇంటికి వెళ్లి భరోసా కల్పించారు.
ఆవేదన చందవద్దని డెలివరీ వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక అంగన్వాడీ కేంద్రం నుండి పౌష్టికాహారం అందజేశారు. ఓ గర్భిణీ యువతి ఆవేదనను ప్రచురించి ఆమె సమస్యకు పరిష్కారం చూపిన ‘నమస్తే తెలంగాణ’కు సర్పంచ్ గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, న్యాయవాది సుగుర్తి జగదీశ్వర చారి, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.