యాసంగి నాట్లు జోరందుకున్నాయి. కాకతీయ కాలువ ద్వారా మొత్తం 7లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి నీటి విడుదలను ప్రారంభించారు. అయితే ఎల్ఎండీ, ఎస్సారార్ జలాశయాల్లో 24 టీఎంసీలే అందుబాటులో ఉండడం, పైనుంచి వచ్చే అవకాశం తక్కువగా ఉన్న నేపథ్యంలో పంటల సాగుకు సరిపడా నీళ్లు వస్తాయో.. రావోనని కాకతీయ కాలువ పరీవాహక ప్రాంతాల రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తిమ్మాపూర్, జనవరి 1: లోయర్ మానేరు జలాశయం(ఎల్ఎండీ) నుంచి కాకతీయ కాలువ ద్వారా సూర్యాపేట జిల్లా వరకు రైతులకు 7లక్షల ఎకరాలను పారించేలా నీటిని అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎల్ఎండీ హెడ్ రెగ్యులేటర్ నుంచి సూర్యాపేట వరకు రెండు జోన్లుగా విభజించి నీటిని విడుదల చేశారు. ప్రధాన కాలువ ప్రారంభం నుంచి 284కిలోమీటర్ వరకు మహబూబాద్ దాక జోన్-1కు 8రోజులు, అక్కడి నుంచి సూర్యాపేట వరకు జోన్-2కు 394కిలోమీటర్ల వరకు 7రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ప్రధాన కాలువకు మూడు నెలల పాటు నిరంతరంగా నీటి విడుదల కొనసాగనుండగా.. విడుతల వారీగా వదలనున్నారు.
29టీఎంసీలతోనే సరి..
ఎల్ఎండీ నుంచి కాకతీయ కాలువ ద్వారా దాదాపు 9లక్షల ఎకరాలు పారాల్సి ఉండగా.. ప్రస్తుతం 7లక్షల ఎకరాలకు నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అధికారులు చెబుతున్న ప్రకారం నీటిని మార్చి31వరకు విడుదల చేస్తారు. ఈ మూడు నెలలకు 7లక్షల ఎకరాల పారకానికి 29 టీఎంసీలు సరిపోతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలే యాసంగి.. యాసంగికి పొలాలకు నీళ్లు ఎక్కువగా అవసరం పడుతాయి. ఈ క్రమంలో చివరి వరకు వెళ్తాయా.? వెళ్లినా పంట పూర్తయ్యేదాక ఇచ్చే అవకాశం ఉంటుందా అన్నది స్పష్టంగా తెలియరావడం లేదు.
10వేల ఎకరాలకు ఒక టీఎంసీ..
ఒక టీఎంసీ నీళ్లు పది వేల ఎకరాలకు పంట పూర్తయ్యేవరకు సరిపోతాయి. ఈ లెక్కన 7లక్షల ఎకరాలకు 70టీఎంసీల నీళ్లు అవసరం పడుతాయి. అయినప్పటికీ వారబంధీ పద్ధతిన విడుదల చేసినా పంటలు ఎండిపోకుండా ఉంటాయా అన్నది సందేహమే..! ప్రస్తుతం అధికారుల లెక్క ప్రకారం ఎల్ఎండీ, మిడ్ మానేర్ నుంచి 24టీఎంసీలు మాత్రమే సాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. అలాగే ఎస్సారెస్పీ నుంచి మరో 5టీఎంసీలు వినియోగించనున్నారు. ఈ నీళ్లను 7లక్షల ఎకరాలకు ఎలా సర్దుబాటు చేస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతానికి 24టీఎంసీలే..
అధికారులు 29టీఎంసీలతో సరిపెడుతాం అని చెప్తున్నా.. ప్రస్తుతం ఎల్ఎండీ, మిడ్ మానేరు జలాశయాల నుంచి సాగునీటికి కోసం అందుబాటులో ఉన్నది కేవలం 24టీఎంసీలు మాత్రమే. మరో 5టీఎంసీలు ఎస్సారెస్పీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. చివరి వరకు ఎద్దడి కాలంలో 5టీఎంసీలు వస్తేనే ఎంతో కొంత వరి పంట పొట్ట దశలో మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ముదురుతున్న నార్లు..
కాకతీయ కాలువ పరీవాహక ప్రాంత రైతులు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. మూడు నెలలే విడుదల చేస్తామని చెప్పడంతో ముందస్తుగా నార్లు పోసుకున్న రైతులు దుక్కులు దున్నేందుకు నీళ్లు లేకపోవడంతో ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. చాలా మంది రైతులు సొంతంగా బావులు, బోర్లు ఉండగా.. కొంత మంది మాత్రం కేవలం కాలువలపైనే ఆధారపడుతున్నారు. అలాంటి రైతుల నార్లు ముదిరిపోతున్నాయి.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఒక డిస్ట్రిబ్యూటరీకి చెందిన రైతులు ఒకే రకమైన పంటను వేసుకోవాలి. రైతులు ఇష్టం వచ్చిన పంట సాగు చేస్తే నీటిని విడుదల చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే చివరి రైతు వరకు నీళ్లు వెళ్లేందుకు అందరూ సహకరించారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించాలి. మూడు నెలల పాటూ ఎల్ఎండీ నుంచి నిరంతరంగా నీటి విడుదల కొనసాగుతుంది.
-శంకర్, ఈఎన్సీ, కరీంనగర్